Mob Set School On fire: ట్యాంకు లోపల విద్యార్థి మృతదేహం, పాఠశాలకు నిప్పు
ABN , Publish Date - May 17 , 2024 | 03:35 PM
బీహార్‌లోని పాట్నాలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. డిగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్జీఛాక్ సమీపంలోని ఓ పాఠశాల ఆవరణలో ఉన్న ట్యాంకులో విద్యార్థి మృతదేహం కనిపించడంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డును దిగ్బంధించడంతో పాటు ఆ పాఠశాలకు నిప్పుపెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పాట్నా: బీహార్‌లోని పాట్నా (Patna)లో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. డిగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్జీఛాక్ సమీపంలోని ఓ పాఠశాల ఆవరణలో ఉన్న ట్యాంకులో విద్యార్థి మృతదేహం కనిపించడంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డును దిగ్బంధించడంతో పాటు ఆ పాఠశాలకు నిప్పుపెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేశాయి.
సంఘటన వివరాల ప్రకారం, రోజువారీ స్కూలు ముగిసిన తరువాత ట్యూషన్ కోసం మూడేళ్ల బాలుడు పాఠశాలకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా ట్యాంకులో పడ్డాడు. పాఠశాల ట్యాంకులో బాలుడి మృతదేహం కనుగొన్నట్టు పోలీసులు చెప్పారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తమకు బాలుడి తల్లిదండ్రుల నుంచి సమాచారం అందటంతో పోలీస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించినట్టు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం బాలుడు స్కూలులోకి వెళ్లినట్టు ఉంది కానీ తిరిగి బయటకు వచ్చినట్టు లేదని పాట్నా ఎస్‌పీ చంద్రప్రకాష్ తెలిపారు. మృతదేహాన్ని దాచిపెట్టి ఉండవచ్చనే అనుమానంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు వివరించారు.