Video Viral: వరద నీటిలో ఐఏఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. పైలెట్లు సురక్షితం
ABN , Publish Date - Oct 02 , 2024 | 05:08 PM
వరద సహాయక సామాగ్రిని పంపిణీ చేస్తున్న భారత వైమానిక దళానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్ బీహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లాలో బుధవారంనాడు అత్యవసర ల్యాండింగ్ అయింది.
ముజఫర్‌పూర్: వరద సహాయక సామాగ్రిని పంపిణీ చేస్తున్న భారత వైమానిక దళానికి (IAF) చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్ బీహార్ (Bihar)లోని ముజఫర్‌పూర్ జిల్లాలో బుధవారంనాడు అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో జలదిగ్బంధంలో ఉన్న ప్రాంతంలోనే విమానం దిగింది. దీంతో ఒకింత ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. అయితే, విమానంలోని ఇద్దరు పైలట్లు సహా ముగ్గురు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Kolkata: ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు.. మమత ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం
ఐఏఎఫ్ హెలికాప్టర్ దర్బంగా నుంచి రిలీఫ్ మెటీరియల్‌ను డ్రాప్ చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సీనియర్ ఎస్పీ రాకేష్ కుమార్ తెలిపారు. జలదిగ్బంధంలో ఉన్న ఆరియా బ్లాక్‌లో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్టు చెప్పారు. అధికారులు అక్కడికి చేరుకోవడానికి ముందే స్థానికులు ఐఏఎఫ్ సిబ్బందిని బయటకు తెచ్చినట్టు తెలిపారు. హెలికాప్టర్‌లోని ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారని, ముందు జాగ్రత్తగా స్థానిక అసుపత్రికి చికిత్స కోసం తరలించామని జిల్లా మెజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ తెలిపారు.
కాగా, భారీ వర్షాలు, వరదలతో కోసి వంటి పలు నదులు సామర్థ్యానికి మించి ప్రవహిస్తుండటంతో బిహార్‌లోని పలు జిల్లాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తోంది. సుమారు 16 జిల్లాల్లోని 10 లక్షల మంది వరద ప్రభావినికి గురైనట్టు తెలుస్తోంది.