BJP : మహా కమలం
ABN , Publish Date - Nov 24 , 2024 | 04:29 AM
.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహా యుతి కూటమి అఖండ విజయం సాధించింది. 288 సీట్ల అసెంబ్లీలో నాలుగింట మూడొంతులకుపైగా స్థానాల్లో ఘన
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం.. మహాయుతికి 80% పైగా సీట్లు
మరాఠా గడ్డపై 90% స్ట్రైక్‌రేట్‌తో బీజేపీ సునామీ
మహాయుతిని గట్టెక్కించిన ఎన్నికల ముందు పథకాలు
మహిళలు, రైతులు, మరాఠాలు, యువత ఓటు దానికే
దేవేంద్ర ఫడణవీసే సీఎం.. డిప్యూటీగా శిందే?
రేపు బీజేపీఎల్పీ భేటీ.. 26న కొత్త సీఎం ప్రమాణం
కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏకు ఘోర పరాభవం
శాసనసభలో ప్రతిపక్ష పార్టీ హోదాకూ దూరమే
ప్రధాన పార్టీలుగా శివసేన, ఎన్సీపీ చీలిక పక్షాలు
ముగిసిన శరద్ పవార్ శకం.. ఉద్ధవ్ థాక్రే దారెటు!?
మజ్లిస్ ఒక చోట గెలుపు.. 4 చోట్ల ద్వితీయ స్థానం
వందేళ్ల కాంగ్రెస్ పార్టీ.. మరాఠా యోధుడు
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన కలిసి పోటీ చేస్తే.. ఆ కూటమికి వచ్చిన సీట్లు చీలిక నేత ఏక్‌నాథ్ శిందే ఆధ్వర్యంలోని శివసేనకు వచ్చిన సీట్ల కంటే తక్కువ! ఎన్సీపీ చీలిక నేత అజిత్ పవార్ పార్టీకి వచ్చిన సీట్ల కంటే కాస్త ఎక్కువ!!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రలోనే అతి ఎక్కువ సీట్ల (132)ను ఆ పార్టీ సాధిస్తే.. అతి తక్కువ సీట్ల (16)తో కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది! అంతేనా.. ఎన్నికల్లో ఆరు ప్రధాన పార్టీలు పోటీ పడితే.. కాంగ్రెస్ ఐదో స్థానంలో నిలిచింది! ఇంకా చెప్పాలంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లతో పోల్చినా మూడో వంతుకు పడిపోయింది! ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది!
గెలుపును కూడా ఓటమిగా మలచుకోగలిగిన సామర్థ్యం కాంగ్రెస్ సొంతమనే భావన ఇప్పుడు బలంగా ప్రబలింది! ఇటీవలి హరియాణా ఎన్నికలతోపాటు ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు ఇందుకు నిదర్శనం! వెరసి, విజయాన్ని చిరునామాగా మార్చుకున్న బీజేపీ ఇప్పటికే దేశంలో 13 రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుని మహా కమలంగా ఆవిర్భవిస్తే.. కాంగ్రెస్ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది!
మహారాష్ట్ర అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. అబద్ధాలు, వంచనకు పాల్పడిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను ఓడించారు. అధికారం కోసం కాంగ్రెస్ కులతత్వమనే విషాన్ని వ్యాపింపజేస్తోంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌లో ఆ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలను మహా ప్రజలు గమనించారు. అందుకే మట్టి కరిపించారు. ‘దేశమే ముందు’ అనే వారితో తప్ప ‘కుర్చీయే ముందు’ అనే వారిని ఓటర్లు నమ్మరని తేలింది.
- ప్రధాని నరేంద్ర మోదీ
... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహా యుతి కూటమి అఖండ విజయం సాధించింది. 288 సీట్ల అసెంబ్లీలో నాలుగింట మూడొంతులకుపైగా స్థానాల్లో ఘన విజయం దక్కించుకుంది. కూటమిలోని బీజేపీ 149 స్థానాల్లో బరిలోకి దిగి ఏకంగా 132 స్థానాల్లో గెలిచింది. అంటే.. దాదాపు 90 శాతం విజయాన్ని (స్ట్రైక్ రేట్) సాధించింది. ఇక, కూటమిలోని ఏక్‌నాథ్ శిందే శివసేన పార్టీ 81 స్థానాల్లో పోటీ చేసి 57 సీట్లను దక్కించుకుంటే.. అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసి 41 సీట్లలో విజయం సాధించింది! ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది! కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన సీట్లను కలిపినా అర్ధ సెంచరీ దాటలేదంటే కాషాయ సునామీని అర్థం చేసుకోవచ్చు! ఇక, ఈసారి ఫలితాల్లో కాంగ్రె్‌సకూ కొంత ఊరట దక్కింది. ఝార్ఖండ్‌లో ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు! ఝార్ఖండ్‌లో వరుసగా రెండోసారి కాంగ్రె్‌స-జేఎంఎం కూటమి ఘన విజయం సాధించింది. 81 సీట్ల అసెంబ్లీలో ఈ కూటమి గత ఎన్నికల్లో 47 సీట్లను సాధిస్తే.. ఈసారి 56 సీట్లను సాధించడం విశేషం. నిజానికి, సీఎం హేమంత్ సోరెన్‌ను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసినా.. నాన్ లోకల్ వివాదాన్ని తెరపైకి తెచ్చినా.. కుటుంబంలో చీలిక తెచ్చి చంపయీ సోరెన్‌ను ఆకర్షించినా ఇక్కడి ప్రజలు హేమంత్ సోరెన్ వైపునకే మొగ్గు చూపారు. ఇక, ఉప ఎన్నికల్లో ఎప్పట్లాగే అధికార పార్టీలే పైచేయి సాధించినా.. అక్కడక్కడ ప్రతిపక్షాలూ మెరుపులు మెరిపించాయి!
యనాడ్‌లో ప్రియాంకం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట ఏదైనా ఉందంటే అది వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అద్భుత విజయమే. గత ఎన్నికల్లో రాహుల్ ఇక్కడ 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తే.. ప్రియాంక అరంగేట్రంతోనే 4.10 లక్షల ఓట్ల ఆధిక్యాన్ని సాధించి లోక్‌సభలో అడుగు పెడుతున్నారు. గాంధీ కుటుంబం నుంచి పార్లమెంటుకు వెళుతున్న మరో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇక, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీలే పైచేయి సాధించాయి. చివరిగా, మహారాష్ట్రలో మహా యుతి; జార్ఖండ్‌లో ఎంవీఏ విజయం సాధిస్తాయన్న ఎగ్జిట్ పోల్స్‌అంచనాకు మించి విజయం సాధించడం విశేషం!! ఇక, శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు.. వివిధ రాష్ట్రాల్లో తన వ్యూహాలతో పార్టీలను గెలిపిస్తున్నానని చెప్పుకొనే ప్రశాంత్ కిశోర్ పార్టీ బిహార్లో కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేదు!!
దేవేంద్రుడు మూడోసారి పీఠం చేపట్టేనా!?
ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న.. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే! అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీకే ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందనే అంచనాలున్నాయి. అందులోనూ ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఫడణవీస్ మూడోసారి ఆ పదవిని చేపడతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికితోడు, శిందే సహాయం లేక పోయినా అధికారం చేపట్టే స్థితిలో ఇప్పుడు బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఫడణవీస్ సీఎం అవుతారని, సీఎం శిందే డిప్యూటీ అవుతారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వెలువడుతున్నాయి. ఇక, ఈ ఎన్నికలతో మరాఠా యోధుడు శరద్ పవార్ శకం ముగిసినట్లే! శివసేనతోపాటు ప్రజా బలాన్ని కూడా శిందే కూడగట్టుకోవడంతో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయాలకూ కాలం చెల్లినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, చీలిక పార్టీలే అక్కడ ప్రధాన పార్టీలుగా చక్రం తిప్పనున్నాయి.
వరాలూ.. కులాలూ!
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది! అక్కడ ఏకంగా 48 లోక్‌సభ సీట్లు ఉంటే బీజేపీకి తొమ్మిదికే పరిమితమైంది. దాంతో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంవీఏ పైచేయి సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ-శిందే సర్కారు అప్రమత్తమైంది. అందరూ ఎన్నికల ప్రచారంలో హామీలు ఇస్తారు. కానీ, మహా యుతి సర్కారు మాత్రం ఎన్నికలకు ముందే తాయిలాలు పంచేసింది. లాడ్కి బహిన్ యోజనను ప్రవేశపెట్టి.. రూ.2.5 లక్షల వార్షికాదాయం ఉండే మహిళలకు నెలకు రూ.1500 ఇస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే దీనిని రూ.2100 చేస్తామని ప్రకటించింది! దాంతో, తాము అధికారంలోకి వస్తే ఈ పథకం కింద రూ.3000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించినా మహిళలు మహా యుతికే జైకొట్టారు! అలాగే, లడ్కా బౌ అనే మరో పథకం కింద నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంతోపాటు శిక్షణ సమయంలో స్టైపెండ్‌నూ ఇస్తోంది. ముంబై నగరం చుట్టూ ఉన్న ఐదు టోల్ గేట్ల ద్వారా ప్రవేశాన్ని ఉచితం చేసేసింది. ఎగుమతులపై నిషేధంతో ఉల్లి రైతుల్లో ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆ నిషేధాన్ని తొలగించింది. ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ మహా యుతికి ఓట్ల వర్షాన్ని కురిపించాయి. మహా యుతి అద్భుత విజయానికి ఒక కారణం వరాలు అయితే.. మరొకటి కుల సమీకరణాలు! లోక్‌సభ ఎన్నికలకు ముందు మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం (ఆ తర్వాత సుప్రీం కోర్టు వాటిని నిలిపివేసింది)తో ఓబీసీలు మహా యుతి కూటమిపై ఆగ్రహంతో ఉన్నారు. వారంతా ఎంవీయే కూటమికి మొగ్గు చూపుతున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు గతంలో తమకు అండగా నిలిచిన ఓబీసీల్లోని మాలి, ధంగర్, వంజరి వంటి బీసీ కులాల నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి వారిని తమ వైపు ఆకర్షించారు. ఏక్‌నాథ్ శిందే స్వయంగా మరాఠా నేత. దాంతో, మరాఠాలంతా మహా యుతికి జైకొట్టారు. ఓబీసీలనూ ఆకర్షించారు. దాంతో, కాంగ్రెస్ పార్టీ ‘ముస్లిం-దళిత్-మరాఠా’ వ్యూహం పని చేయలేదు. దీనికితోడు, ముస్లిములతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం కుదుర్చుకుందని ప్రచారం చేసిన బీజేపీ.. విడిపోతే పడిపోతాం, ఐక్యంగా ఉంటే క్షేమంగా ఉంటామనే నినాదాలతో హిందూ ఓటును ఏకీకృతం చేయడానికి పావులు కదిపింది. మరాఠా నేతగా శిందే ఆవిర్భవిస్తే.. శరద్ పవార్ స్థానం భవిష్యత్తులో అజిత్‌దేనన్న సంకేతాలూ వెళ్లాయి. ఉద్ధవ్ ఠాక్రే రెండున్నరేళ్ల పాలనకు భిన్నంగా శిందే సైలెంట్‌గానే అభివృద్ది, సంక్షేమ పాలనతో ప్రజలను ఆకర్షించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్న సంఘ్.. అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో, ఇవే తన చివరి ఎన్నికలని శరద్ పవార్ చెప్పడం.. బాల్ ఠాక్రే దూకుడును ఉద్ధవ్ ఠాక్రే కొనసాగించకపోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలోని అనుకూలతను తనకు అనుకూలంగా మలచుకోలేకపోయింది. ఫలితమే.. మహా యుతి ఘన విజయం!
మోదీ సమర్థ నాయకత్వంతో గెలుపు
మోదీ సమర్థ నాయకత్వంలోని డబుల్ ఇంజన్ సర్కారు సంక్షేమ విధానాలు, సుపరిపాలనపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి మహాయుతి కూటమి ఘన విజయమే అద్దం పడుతోంది..
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
ఇది అఖండ విజయం..
ఎన్డీయేకు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు. మహాయుతి భారీ మెజార్టీ సాధిస్తుందని గతంలోనే చెప్పా. మహిళలు, రైతులు, వృద్ధులు.. అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు.
- ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర సీఎం
నేను ఆధునిక అభిమన్యుడిని..
నేనొక ఆధునిక అభిమన్యుడినని ముందే చెప్పా.. చక్రవ్యూహంలో ప్రవేశించడమే కాదు చేధించుకొని బయటికి రాగలనని నిరూపించుకున్నా. మోదీ ఉంటే అన్ని సాధ్యమే.. 3 పార్టీల సమావేశం నిర్వహించి సీఎం ఎవరనే దానిపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం..
- ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
ఇది కుట్ర.. ప్రజల నిర్ణయం కాదు
ఈ ఫలితాలను అంగీకరించడానికి సిద్ధంగా లేము. మాకు అనుమానాలున్నాయి. ఇది ప్రజల నిర్ణయం కానే కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఇందులో కుట్ర దాగి ఉంది. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అయినా మహాయుతి కూటమికి అన్ని సీట్లు ఎలా వస్తాయి?
- సంజయ్ రౌత్, శివసేన (యూబీటీ)
ఇలాంటి ఫలితాలు ఊహించలేదు..
మహారాష్ట్రలో ఇలాంటి ఫలితాలను అస్సలు ఊహించలేదు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటాం. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ భావజాలానికి మేమే నిజమైన వారసులం.. మా పోరాటం కొనసాగుతుంది. ఝార్ఖండ్ ప్రజలు తమ హక్కులు, నీరు, అటవీ, భూమి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విభజన రాజకీయాలు, తప్పుడు హామీలను తిప్పికొట్టారు.
- ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
రాజ్యాంగ పరిరక్షణకు దక్కిన విజయం
ఇండియా కూటమికి భారీ విజయం అందించిన ఝార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు. సీఎం హేమంత్ సొరేన్‌కు, కాంగ్రెస్, జేఎంఎం పార్టీల కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఝార్ఖండ్‌లో కూటమి గెలుపు.. రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూమి పరిరక్షణకు దక్కిన విజయం. మహారాష్ట్ర ఫలితాలు అనూహ్యం.. సమగ్రంగా విశ్లేషించుకుంటాం. వయనాడ్‌లోని నా కుటుంబం ప్రియాంకను భారీ మెజార్టీతో గెలిపించినందుకు గర్విస్తున్నా. - రాహుల్, కాంగ్రెస్ అగ్ర నేత