Annamalai: కొరడాతో కొట్టుకుని నిరసన
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:17 AM
ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితిపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న చర్య
చెన్నై, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనకు ప్రభుత్వ భద్రతా వైఫల్యమే కారణమంటూ, ఇందుకు నిరసనగా శుక్రవారం అన్నామలై కొరడాతో ఆరుసార్లు కొట్టుకున్నారు. విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ తాను 48 రోజుల పాటు వ్రతం ఆచరించి మురుగన్ ఆలయానికి వెళ్లి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాల గురించి నివేదించనున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు.
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను పాదరక్షలు ధరించని శపథం చేశారు. వ్రతంలో భాగంగా తన ఇంటి వద్దే ఆరుసార్లు కొరడాతో కొట్టుకుంటానన్నారు. ఆ ప్రకారం శుక్రవా రం కోయంబత్తూరులో తన నివాసం ఎదుట చొక్కా లేకుండా, పచ్చరంగు లుంగీ ధరించి, నుదుట విభూతి రేఖలు దిద్దుకుని పార్టీ కార్యకర్తల సమక్షంలో కొరడాతో కొట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన చుట్టూ చేరిన పార్టీ శ్రేణులు ‘వెట్టివేల్.. వీరవేల్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
తమిళ సంప్రదాయంలో భాగమే: అన్నామలై
అన్నామలై విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నిరసన తమిళ సంప్రదాయంలో భాగమేనని అన్నారు. బీజేపీ కార్యకర్తలెవరూ తనను అనుసరించరాదని విజ్ఞప్తి చేశారు. మహిళా లోకానికి జరుగుతున్న అన్యాయాల ను నిరోధించాలని తమిళుల ఆరాధ్య దైవమైన మురుగప్పెరుమాన్‌ను వేడుకోవటంలో భాగంగానే మండలం పాటు వ్రతం ఆచరిస్తున్నట్లు చెప్పారు.