Lok Sabha Elections: 400 సీట్ల లక్ష్యం సాధిస్తాం: రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Apr 30 , 2024 | 03:10 PM
లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్ల లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ సాధించి తీరుతుందని, కేంద్రంలో మూడోసారి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని దేశ ప్రజల స్థిర నిశ్చయంతో ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారంనాడు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్ల లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) సాధించి తీరుతుందని, కేంద్రంలో మూడోసారి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని దేశ ప్రజల స్థిర నిశ్చయంతో ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మంగళవారంనాడు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
అమేథీ, రాయబరేలిలోనూ గెలుస్తాం
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ పొత్తు ఎలాంటి ప్రభావం చూపించదని, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా యూపీ ప్రజలు లబ్ధి పొందుతున్నారని రాజ్‌నాథ్ చెప్పారు. కుల, మత ప్రసక్తి లేకుండా ఎలాంటి వివక్షకు తావులేని విధంగా తాము పనిచేస్తున్నామని, ప్రజలు కూడా దీనిని అర్ధం చేసుకున్నారని అన్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో కూడా ఎలాంటి పస లేదని, తాము అమేథీ, రాయబరేలిలో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణాదిలో బీజేపీ అవకాశాలపై..
దక్షిణాదిలోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని రాజ్‌నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పాపులారిటీకి తిరుగులేదని, దక్షిణాదిలోనూ బీజేపీ సీట్లు కచ్చితంగా పెరుగుతాయని చెప్పారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో తాను పర్యటించానని, ఆయా చోట్ల వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని తెలిపారు.
Amit Shah: రేవణ్ణ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అమిత్ షా సూటిప్రశ్న
రిజర్వేషన్ వివాదంపై..
భారత సామాజిక వ్యవస్థలో రిజర్వేషన్లు అంతర్భాగమని, అవి యథాతథంగా కొనసాగుతాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. రాజ్‌పుత్ ఓటర్లతో బీజేపీ పటిష్ఠ బంధం కలిగి ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ''రిజర్వేషన్లు ఉన్నాయి, అలాగే ఉంటాయి'' అని ఆయన స్పష్టం చేశారు.
లక్నో నుంచి పోటీ...
రాజ్‌నాథ్ సింగ్ తాజా లోక్‌సభ ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈనెల 29న ఆయన నామనేషన్ వేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా రాజ్‌నాథ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్‌సభ 5వ విడత ఎన్నికల్లో భాగంగా మే 20న లక్నోలో పోలింగ్ జరుగనుంది. ఒకప్పుడు మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి ప్రాతినిధ్యం వహించిన లక్నో నియోజకవర్గంలో రాజ్‌నాథ్ వరుసగా మూడోసారి గెలుపును ఆశిస్తున్నారు. లక్నో నుంచి ఆయనపై సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రా పోటీ చేస్తున్నారు.
Read Latest National News and Telugu News