Vijender Singh: బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్
ABN , Publish Date - Apr 03 , 2024 | 04:20 PM
లోక్‌సభ ఎన్నికల వేళ బాక్సర్ విజేందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వినోద్ తావ్డే, రామ్‌వీర్ సింగ్ బిధూరి, రాజీవ్ బబ్బర్ సమక్షంలో బుధవారంనాడు పార్టీలో చేరారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ బాక్సర్ విజేందర్ సింగ్ (Vijender Singh) భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వినోద్ తావ్డే, రామ్‌వీర్ సింగ్ బిధూరి, రాజీవ్ బబ్బర్ సమక్షంలో బుధవారంనాడు పార్టీలో చేరారు. అనంతరం ఆయన ఒక ట్వీట్‌లో ''దేశ అభివృద్ధి, ప్రజాసేవ చేసేందుకు బీజేపీలో ఇవాళ చేరాను'' అని ప్రకటించారు. విజేందర్ సింగ్ హర్యానాలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన జాట్ సామాజిక వర్గానికి చెందినవారు.
కాంగ్రెస్ నుంచి...
విజేందర్ సింగ్ గతంలో కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆయనను మధుర నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉందనే ప్రచారం ఇంతకుముందు జరిగింది. మధుర నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ హేమమాలిని మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా,. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు కూడా హర్నానాలోని కర్నల్‌లో ఆయనతో కలిసి విజేందర్ సింగ్ పాల్గొన్నారు. బాక్సింగ్ రంగలో దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన విజేందర్ సింగ్ 2010లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.