Bharat Ratna: కాన్షీరామ్‌ను విస్మరించారు.. భారతరత్నపై మాయావతి
ABN , Publish Date - Feb 09 , 2024 | 05:21 PM
దళిత ఐకాన్, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం 'భారతరత్న' ప్రకటించిన కొద్దిసేపటికే మాయావతి తన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
న్యూఢిల్లీ: దళిత ఐకాన్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకుడు కాన్షీరామ్ (Kanshi Ram)కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' (Bharat Ratna) ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ మాయావతి (Mayawati) డిమాండ్ చేశారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం 'భారతరత్న' ప్రకటించిన కొద్దిసేపటికే మాయావతి తన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారవు, స్వా్మినాథన్‌లకు భారతరత్న ప్రకటించడాన్ని మాయావతి వరుస ట్వీట్లలో స్వాగతించారు. అయితే దళిత ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని తప్పుపట్టారు. ''బీజేపీ ప్రభుత్వం ప్రముఖులకు భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే దళిత ప్రముఖులకు తగిన గౌరవం ఇవ్వకపోవడం, విస్మరించడం తగదు. ప్రభుత్వం ఈ విషయంపై కూడా దృష్టి సారించాలి'' అని మాయావతి అన్నారు. అట్టడుగు వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కాన్షీరామ్, బీఆర్ అంబేడ్కర్ అసమాన కృషి చేశారని తెలిపారు. చాలాకాలం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను భారతరత్నతో గౌరవించిందని అన్నారు. అంబేడ్కర్ తర్వాత దళితుల ఆశాజ్యోతి, దళితుల కోసం పోరాడిన కాన్షీరామ్‌ను కూడా గౌరవించాల్సి ఉందని, ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.