Ayodhya Resolution: అయోధ్య ఘనతపై మోదీకి అభినందనలు.. కేంద్ర కేబినెట్ తీర్మానం
ABN , Publish Date - Jan 24 , 2024 | 07:30 PM
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మోదీని ప్రశంసలతో ముంచెత్తింది.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)ని అభినందిస్తూ కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మోదీని ప్రశంసలతో ముంచెత్తింది. రామమందిర నిర్మాణం జన్మకొకసారి వచ్చే అవకాశం కాదని, జన్మజన్మలకు ఒకసారి వచ్చే అవకాశం అని పేర్కొంది. శతాబ్దాలుగా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న ప్రజల ఆకాంక్షలను మోదీ నెరవేర్చారని ఆ తీర్మానం కొనియాడింది.
క్యాబినెట్ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన మంత్రివర్గ సహచరుల తరఫున మోదీని అభినందిస్తూ తీర్మానాన్ని చదవి వినిపించారు. బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశం ఒక చారిత్రక సమావేశమని ఆయన పేర్కొన్నారు. దేశంలో క్యాబినెట్ సిస్టం మొదలైనప్పటి నుంచి ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అయోధ్యలో విజయవంతంగా రామాలయ నిర్మాణం జరగడం, ప్రాణప్రతిష్ఠ నిర్వహించడం చరిత్రలోనే ప్రముఖంగా నిలిచిపోతుందని అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, దేశ ఆత్మ 'ప్రాణప్రతిష్ఠ' 2024 జనవరి 22న జరిగిందని రాజ్‌నాథ్ అభివర్ణించారు. మోదీకి అభినందనలు తెలుపుతూ క్యాబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు సమావేశానంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.