Google Maps: గూగుల్ మ్యాప్స్‌పై కేసు వేయొచ్చా..?
ABN , Publish Date - Nov 25 , 2024 | 06:19 PM
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మ్యాప్స్ బాధితులు భారీగా ఉన్నారు. మరి ఈ బాధితులు ఎవరైనా గూగుల్ మ్యాప్స్‌పై ఫిర్యాదు చేశా? చేస్తే చర్యలు చేపట్టారా? అంటే..
హైదరాబాద్, నవంబర్ 25: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు పలువురు విద్యార్థులు గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించారు. దానిని అనుసరించి.. మరో ప్రాంతానికి వెళ్లారు. ఆ క్రమంలో వారు పరీక్ష కేంద్రానికి చేరుకోలేదన్న విషయం తెలుసుకుని నిరాశ చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మరో చోటు గూగుల్ మ్యాప్‌ను వాహనదారులు ఆశ్రయించారు. దీంతో వారి వాహనం నదిలోకి దూసుకు వెళ్లింది. వెంటనే అప్రమత్తం కావడంతో.. ప్రాణాలతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వారు బతికి బయటపడ్డారు. ఈ ఘటన కేరళలో జరిగింది.
తాజాగా కారులో ప్రయాణిస్తున్న వారు గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఇటీవల చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం.. గూగుల్ మ్యాప్స్ అనుసరించింది. తీవ్ర పొగమంచు నేపథ్యంలో వారు జీపీఎస్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో వారు ప్రయాణిస్తున్న వాహనం.. నిర్మాణంలో ఉన్న వంతెన మీదకు వెళ్గింది. దీంతో ఆ కారు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే గూగుల్ మ్యాప్ అనుసరించడం వల్లే సదరు కుటుంబం ప్రాణాలు కోల్పోయిందని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించడం గమనార్హం. మరి అలాంటి వేళ.. గూగుల్ మ్యాప్ మీద కేసు నమోదు చేస్తారా? అనే ప్రశ్న సర్వత్ర ఉత్పన్నమవుతుంది.
దేశంలోనే కాదు.. ప్రపంచంలో సైతం గూగుల్ మ్యాప్స్ అనుసరించి ప్రయాణించడం వల్ల పలువురు దుర్మణం పాలవుతున్నారు. దీంతో ఈ మ్యాప్స్‌పై కేసు నమోదు చేసి.. పోలీసులు చర్యలు చేపడతారా? అనే సందేహం అయితే పలువురిలో వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటికే పలువురు గూగుల్ మ్యాప్‌పై ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు చర్యలు చేపట్టారా? అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటే..
గూగుల్ మ్యాప్స్ కాపురాలు కూల్చుతోందంటూ తమిళనాడుకు చెందిన చంద్రశేఖరన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగపట్టణం జిల్లా మైలదురైకి చెందిన అతడి ఫోన్లో గూగుల్ మ్యాప్స్ యాప్ఉంది. అతడి కదలికలను భార్య ఎప్పటికప్పుడు గమనించేది. దీంతో అతడికి మనశ్శాంతి కరువైంది. దాంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో గూగుల్ మ్యాప్‌పై ఫిర్యాదు చేశారు. తన ప్రశాంతతకు భంగం కలిగించిన గూగుల్ మ్యాప్స్ పరిహారం చెల్లించాలని ఆతడు డిమాండ్ చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎంత పురోగతి సాధించారంటే మాత్రం సందేహమే వ్యక్తమవుతుంది.
ఇక గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలో సేల్స్‌మేన్ ఫిలిప్ పాక్సన్.. తన స్నేహితుడి నివాసంలో జన్మదిన వేడుకలకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి బయల్దేరాడు. ఆ క్రమంలో వర్షం భారీగా కురుస్తుంది. ఆ ప్రాంతం కొత్త కావడం... అదీ రాత్రి కావడంతో గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ కారు డ్రైవింగ్ చేశాడు. దీంతో సగం కూలిపోయిన బ్రిడ్జిపైకి అతడి కారు వెళ్లింది. అనంతరం 20 అడుగుల ఎత్తు నుంచి కారు కింద పడిపోయింది. దీంతో కారు నదిలో మునిగి ఫిలిప్ పాక్సన్ మరణించారు. దాంతో అతడి భార్య గూగుల్ మ్యాప్ కారణంగానే తన భర్త చనిపోయాడని ఆరోపించింది. ఆ క్రమంలో గూగుల్ మ్యాప్స్‌పై ఆమె యూఎస్ కోర్టులో దావా వేసింది. అయితే ఈ కేసు నమోదు చేసి దాదాపు ఏడాది దాటింది. కానీ ఈ కేసులో పురోగతి ఎంత వరకు వచ్చిందంటే.. చెప్పడం కష్టం.
అలాంటి వేళ గూగుల్ మ్యాప్స్‌పై ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు నమోదు అయితే చేస్తారు కానీ.. ఫలితం మాత్రం ఎలా ఉంటుదన్నది మాత్రం ఎవరు చెప్పలేరనే వాదనకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయనే వాదన సర్వత్రా వినిపిస్తుంది.
For National News And Telugu News