Share News

వలసలకు కెనడా కళ్లెం!

ABN , Publish Date - Oct 26 , 2024 | 03:50 AM

దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించినట్లు కెనడా ప్రకటించింది. దేశంలో జనాభా పెరుగుదలకు అడ్డుకట్టవేయడంతోపాటు వలసలపై స్థానికుల్లో వ్యతిరేకత పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

వలసలకు కెనడా కళ్లెం!

  • వచ్చే మూడేళ్లలో ఏటా లక్ష మందికిపైగా కోతలు

న్యూఢిల్లీ/అట్టావా, అక్టోబరు 25: దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించినట్లు కెనడా ప్రకటించింది. దేశంలో జనాభా పెరుగుదలకు అడ్డుకట్టవేయడంతోపాటు వలసలపై స్థానికుల్లో వ్యతిరేకత పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2023-24 మధ్య కాలంలో కెనడా జనాభా 3.2శాతం పెరిగి 4.1 కోట్లకు చేరుకుంది. వలసదారుల సంఖ్య అనూహ్యంగా పెరగడమే దీనికి కారణంగా పేర్కొంది. వలసలపై ఆంక్షలను ప్రకటించిన ప్రధాని జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తామని ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం వచ్చే రెండేళ్లలో జనాభా పెరుగుదలలో విరామానికి దోహదపడుతుంది’ అన్నారు.

ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం, సామాజిక సేవల్లో అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో ఎక్కువ మందికి వసతి కల్పించడానికి కెనడా జనాభాను స్థిరీకరించాల్సిన అవసరం ఉంద న్నారు. కాగా 2025, 2026 సంవత్సరాల్లో 5లక్షల మంది చొప్పున దేశంలో కొత్తగా శాశ్వత నివాసానికి అనుమతించాలని కెనడా ఇమ్మిగ్రేషన్‌ శాఖ గతంలో ప్రణాళికలు సిద్ధంచేసింది.

అయితే ప్రస్తుతం ఆ లక్ష్యాలను వచ్చే ఏడాది 3,95,000కు, 2026లో 3,80,000కు, 2027లో 3,65,000గా నిర్ణయించారు. ఇటీవల వలస వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరు భారత్‌ నుంచి వచ్చారని స్టాటిస్టిక్స్‌ ఏజెన్సీ తెలిపింది. కాగా ఉన్నత విద్యను అభ్యసించడానికి కెనడా వెళ్లే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజయ్‌ వర్మ హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కెనడా పంపేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.

Updated Date - Oct 26 , 2024 | 03:50 AM