Share News

భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:43 AM

భారత్‌పై కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్న కెనడా ఇప్పుడు ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై పడింది.

 భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర

డాక్యుమెంట్లు తిరిగి సమర్పించాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారుల ఆదేశాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 14: భారత్‌పై కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్న కెనడా ఇప్పుడు ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై పడింది. కీలక డాక్యుమెంట్లను మరోసారి తమకు సమర్పించాలని పేర్కొంటూ.. కెనడా ఇమ్మిగ్రేషన్‌, రిఫ్యూజీస్‌, సిటిజన్‌షిప్‌ కెనడా(ఐఆర్‌సీసీ) ఈ మెయిళ్ల ద్వారా ఆదేశాలు జారీ చేసింది. వీటిలో అధ్యయన అనుమతులు, విసాలు, ఎడ్యుకేషనల్‌ రికార్డులు, మార్కులు, అటెండెన్స్‌ వంటి పలు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఐఆర్‌సీసీ ఆదేశాలతో భారత విద్యార్థులు సహా అంతర్జాతీయ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కాగా, వీరిలో చాలా మంది రెండేళ్లపాటు చెల్లుబాటు అయ్యే వీసాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు డాక్యుమెంట్లను అడ్డుపెట్టుకుని ఎదైనా మెలిక పెట్టి తమ వీసాలను రద్దు చేస్తారేమోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐఆర్‌సీసీ వాదన మరో విధంగా ఉంది. ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల ప్రవేశాలను నియంత్రించాలని నిర్ణయించినట్టు తెలిపింది. విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. కెనడాలో 4.2 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. మరోవైపు, అమెరికాలోనూ సరైన ధ్రువపత్రాలు లేని 18 వేల మంది భారతీయ విద్యార్థులను దేశం నుంచి పంపించేందుకు రంగం రెడీ అవుతున్నట్టు తెలిసింది. వీరిలో గుజరాత్‌, పంజాబ్‌, ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఇమిగ్రేషన్‌ అధికారుల కథనం ప్రకారం.. ఈ ఏడాది నవంబరు నాటికి 14.45 లక్షల మంది విద్యార్థులను అమెరికా నుంచి పంపేయాలని నిర్ణయించుకున్నారు. వీరిలో 17,940 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 04:43 AM