Share News

Bengaluru: మాల్ యాజమాన్యంతోపాటు భద్రతా సిబ్బందిపై కేసు నమోదు

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:27 PM

బెంగుళూరులో పంచె కట్టు కొచ్చాడనే కారణంగా రైతును మాల్‌‌లోకి అనుమతించక పోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో మాల్ యాజమాన్యంతోపాటు భద్రతా సిబ్బందిపై బెంగుళూరు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

Bengaluru: మాల్ యాజమాన్యంతోపాటు భద్రతా సిబ్బందిపై కేసు నమోదు

బెంగుళూరు, జులై 18: బెంగుళూరులో పంచె కట్టు కొచ్చాడనే కారణంగా రైతును మాల్‌‌లోకి అనుమతించక పోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో మాల్ యాజమాన్యంతోపాటు భద్రత సిబ్బందిపై బెంగుళూరు పోలీసులు గురువారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం కుమారుడు స్వతహాగా రైతు అయిన తన తండ్రితో కలిసి సినిమా చూసేందుకు మాల్‌కు వచ్చారు. అయితే పంచె కట్టుకున్న తండ్రిని మాల్‌లోకి ప్రవేశం లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు.

Also Read: Maharastra: లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన


ఫ్యాంట్ ధరించి వస్తే.. మాల్‌లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. కానీ రైతు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. ఈ మొత్తం తతంగాన్ని రైతు కుమారుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో రైతు పట్ల మాల్ భద్రత సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ రైతును అమర్యాద పరిచారు, వివక్ష చూపారంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇక ఘటనపై రైతు సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అందులోభాగంగా సదరు మాల్ ఎదుట బుధవారం రైతులు పంచెలు ధరించి మరీ ఆందోళన చేపట్టారు.

Also Read: Telangana: చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!


రైతులకు మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక రైతు నాయకుడు కురుబురు శాంత కుమార్ అయితే... మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ ఏడాది మొదట్లో అశుభ్రతతో ఉన్నాడంటూ.. ఓ వ్యక్తిని మెట్రో రైలులో ప్రయాణించేందుకు అనుమతించ లేదని గుర్తు చేశారు. ఈ మాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని శాంత కుమార్ డిమాండ్ చేశారు. ఇంకోవైపు బీజేపీ సైతం ఈ ఘటనపై ఘాటుగా స్పందించింది.


అలాగే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్ ఏ హరీస్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటన ఆమోదయోగ్యం కానిదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే హరీస్ విజ్జప్తి చేశారు. పంచె కట్టుకోవడం సంప్రదాయానికి చిహ్నమని ఎమ్మెల్యే హరీస్ తెలిపారు.


ఇక మాల్‌పై కర్ణాటక ప్రభుత్వం గురువారం కఠిన చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో 7 రోజులు పాటు మాల్‌ను మూసివేయాలని ఆదేశించింది. రైతును మాల్‌లోకి వెళ్లనీయక పోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలోని నేతలు సైతం ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దాంతో మాల్‌ను వారం రోజుల పాటు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 08:19 PM