కర్ణాటక సీఎంపై లోకాయుక్తలో కేసు
ABN , Publish Date - Sep 28 , 2024 | 03:55 AM
ముడా ఇంటిస్థలాల వివాదంపై విచారణ జరిపేందుకు హైకోర్టు, ప్రజా ప్రతినిధుల కోర్టులు అనుమతులు ఇవ్వడంతో మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఏ1గా ముఖ్యమంత్రి, ఏ2గా ఆయన భార్య పార్వతి, ఏ3గా బావమరిది
ట్రస్టు పేరిట భూ కుంభకోణం.. ఖర్గే కుటుంబంపైన ఫిర్యాదు
నేడు ఆయన.. రేపు ఎవరో!
సీఎం ఎవరైనా పార్టీనే ముఖ్యం
సిద్దరామయ్య భవితవ్యంపై ఖర్గే నర్మగర్భ వ్యాఖ్యలు
ముడా ఇంటి స్థలాల వివాదంలో ఆయననే ఏ1
ఈ రోజు సిద్దరామయ్య సీఎం.. రేపు ఉండకపోవచ్చు : ఖర్గే
బెంగళూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ముడా ఇంటిస్థలాల వివాదంపై విచారణ జరిపేందుకు హైకోర్టు, ప్రజా ప్రతినిధుల కోర్టులు అనుమతులు ఇవ్వడంతో మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సీఎం సిద్దరామయ్యను ఏ1గాను, ఆయన భార్య పార్వతి ఏ2గాను, బావమరిది మల్లికార్జున ఏ3గాను, భూయజమాని దేవరాజు ఏ4గానూ చేర్చారు. ఏ5గా ఇతరులను పేర్కొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
అందుకు అనుగుణంగానే ఐపీసీ, అవినీతి నియంత్రణ చట్టం, బినామీ ఆస్తుల లావాదేవీలు, భూ ఆక్రమణల నిర్బంధ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 120బి, 166, 403, 420, 426, 465, 468, 340, 351 సెక్షన్ల కింద, అవినీతి నియంత్రణ చట్టం 1988 నిబంధనలకు అనుగుణంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సీఎంపై ఎఫ్‌ఐఆర్ నమోదు విషయంలో మైసూరు లోకాయుక్త ఎస్పీ ఆచితూచి వ్యవహరించారు. భారతీయ న్యాయ సంహిత లేదా సీఆర్‌పీసీల కింద నమోదు, కోర్టు నిబంధనలు... వంటి అంశాలపై లోకాయుక్త ఉన్నతాధికారులతో చర్చించేందుకు గురువారం బెంగళూరుకు వచ్చారు.
సమగ్ర చర్చల అనంతరం శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మూడు రోజుల మైసూరు పర్యటనకు శుక్రవారం సీఎం సిద్దరామయ్య వెళ్లిన సమయంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. లోకాయుక్త అధికారులు దర్యాప్తు ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ‘సిద్దరామయ్య ఈ రోజు సీఎంగా ఉన్నారు.. రేపు ఉండకపోవచ్చు..! ఆయనపై వ్యక్తిగతమైన ఆరోపణలు వచ్చినా బీజేపీ ఏకంగా కాంగ్రెస్‌పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తోంది’ అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఎవరైనా పార్టీ ప్రతిష్ట ముఖ్యమన్నారు.
పార్టీ ముందు ఎవరూ గొప్ప కాదని అన్నారు. సిద్దరామయ్యపై లోకాయుక్త విచారణకు సంబంధించి మాట్లాడుతూ గోద్రా సంఘటన జరిగినప్పుడు నరేంద్రమోదీ సీఎం పదవికి రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. ముడా వివాదంలో చట్టపరంగా పోరాటం చేస్తామని అన్నారు. సిద్దరామయ్యకు పార్టీ అధిష్ఠానం మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆయన పార్టీ ప్రతినిధి అని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో నేరుగా సీబీఐ విచారణకు అనుమతి రద్దు చేయడం కొత్తేమీ కాదని, దేవరాజ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చేశారని అన్నారు. మరోవైపు, ముడా భూ కుంభకోణం నేపథ్యంలో కర్ణాటకలో కేసుల విచారణకు సీబీఐకి అనుమతి ఉపసంహరించుకుంటూ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఇది ‘ప్రొఫెషనల్ దొంగ, ఓ అవినీతి పార్టీ’ తీసుకున్న నిర్ణయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అభివర్ణించారు. 5 వేల కోట్ల ముడా స్కామ్‌లో సీఎం సిద్దరామయ్య సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు.
Also Read:
షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
మమ్మల్ని వదిలేసి.. అతనితో సెల్ఫీలా!
For More National News and Telugu News..