Share News

జగన్‌ కేసుల్లో పెండింగ్‌.. పెండింగ్‌ విచారణ దశలో 125 పిటిషన్లు

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:14 AM

జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి 125 పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయని సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదించింది.

జగన్‌ కేసుల్లో పెండింగ్‌.. పెండింగ్‌ విచారణ దశలో 125 పిటిషన్లు

80 శాతం వ్యాజ్యాలు పెండింగ్‌

సుప్రీంలో 15 స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు.. వాటిలో 12 పెండింగ్‌

ట్రయల్‌ కోర్టులో 86 డిశ్చార్జి పిటిషన్లు

ఒక్క దానిపైనా తుదితీర్పు రాలేదు.. సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదన

న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి 125 పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయని సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదించింది. ఇప్పటి వరకు 860 మంది సాక్షులను కోర్టు విచారించిందని వెల్లడించింది. సుప్రీంకోర్టులో మొత్తం 15 స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు కాగా.. అందులో 12 పిటిషన్లు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యమవుతోందని, ట్రయల్‌ వేగవంతంగా పూర్తి చేయాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ర్టానికి బదిలీ చేయాలని కోరారు. అదేవిధంగా జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని.. లేకపోతే విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని మరో పిటిషన్‌ వేశారు. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వాస్తవానికి జగన్‌ కేసుల్లో జాప్యానికి కారణాలు.. అన్ని కోర్టుల్లో పెండింగ్‌ కేసుల వివరాలు, విచారణ ఏ దశలో ఉందన్న సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. గురువారం సాయంత్రం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశామని సీబీఐ తరఫు న్యాయవాది శుక్రవారం ధర్మాసనానికి వివరించారు. జగన్‌ కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఈడీ అఫిడవిట్‌ రూపంలో సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చాయన్నారు. స్టేటస్‌ రిపోర్టు పరిశీలనకు మరింత సమయం కావాలని జగన్‌ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే.. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలు పరిశీలించాక తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.


80 శాతం పిటిషన్లపై విచారణ పెండింగ్‌...

గన్‌ అక్రమాస్తులకు సంబంధించి 80 శాతం పిటిషన్లపై విచారణ పెండింగ్‌లోనే ఉందని దర్యాప్తు సంస్థలు తమ నివేదికలో తెలిపాయి. ‘మొత్తం 120 మంది నిందితులపై చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 860 మంది సాక్షులను కోర్టు విచారించింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో మొత్తం 125 పిటిషన్ల విచారణ పెండింగ్‌లో ఉంది. ట్రయల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన పిటిషన్లలో దాదాపు 80 శాతం పెండింగ్‌ ఉన్నాయి. ట్రయల్‌ కోర్టులో 11 కేసుల్లో 86 డిశ్చార్జి పిటిషన్లు దాఖలయ్యాయి. అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏ ఒక్క డిశ్చార్జి పిటిషన్‌లోనూ తుది తీర్పు వెలువడలేదు. తెలంగాణ హైకోర్టులో నిందితులు 40 పిటిషన్లు దాఖలు చేయగా.. ఇంకా 27 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి’ అని నివేదికలో వెల్లడించాయి.

Updated Date - Dec 14 , 2024 | 04:14 AM