బీజేపీ, కాంగ్రెస్‌కు ఈసీ నోటీసులు
ABN , Publish Date - Nov 17 , 2024 | 03:21 AM
బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఇరు పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు అమిత్ షా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ, నవంబరు 16: బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఇరు పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు అమిత్ షా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వారి వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకల్లా స్పందన తెలియజేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేలకు స్పష్టం చేసింది. ఈ నెల 6న ముంబైలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మహారాష్ట్ర యువతను రెచ్చగొట్టేలా మాట్లాడారని బీజేపీ ఈ నెల 11న ఈసీకి ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఇతర రాష్ట్రాల వారు దోచుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు, ఐక్యతకు ముప్పు కలిగిస్తాయని బీజేపీ పేర్కొంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ నేత అమిత్ షాపై ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్, కూటమి పార్టీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాగేసుకొని, ఒక మతానికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ షా ఆరోపించారని.. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టడమేనని ఫిర్యాదులో పేర్కొంది.