Central Election Commission : నాలుగో దశలో 69 శాతం పోలింగ్
ABN , Publish Date - May 18 , 2024 | 05:03 AM
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 69.16 శాతం పోలింగ్ నమోదైంది. గత మూడు దశలలో జరిగిన ఎన్నికల కంటే నాలుగోదశలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ, మే 17(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 69.16 శాతం పోలింగ్ నమోదైంది. గత మూడు దశలలో జరిగిన ఎన్నికల కంటే నాలుగోదశలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13న దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ జరిగింది. 10 రాష్ట్రాలలో జరిగిన పోలింగ్‌తో పోలిస్తే అత్యధికంగా ఏపీలో 80.66 శాతం(పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 81.86ు) పోలింగ్ నమోదైంది. ఏపీలో ఒకే దశలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగడంతో అత్యధికంగా ఓటర్లు పాల్గొన్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
కాగా, ఏపీలోని 25 పార్లమెంటు స్థానాలలో అత్యధికంగా ఒంగోలులో 87.06శాతం, విశాఖపట్నంలో అత్యల్పంగా 71.11 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీ తర్వాత రెండో స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో 80.22 శాతం నమోదైంది. నాలుగో దశలో పురుష ఓటర్ల పోలింగ్ 69.58 శాతం ఉండగా మహిళల పోలింగ్ శాతం 68.73గా నమోదైనట్టు ఈసీ వివరించింది. ఐదో దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. మొత్తం 49 పార్లమెంటు స్థానాలు సహా ఒడిశాలోని అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు.