Chamapai Soren: గవర్నర్‌ను కలిసిన చంపైసోరెన్.. ప్రభుత్వ ఏర్పాటుకు సై..
ABN , Publish Date - Feb 01 , 2024 | 06:57 PM
రెండ్రోజులుగా జార్ఖాండ్ ప్రభుత్వంలో తలెత్తిన ప్రతిష్ఠంభన కొలిక్కి వస్తోంది. జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేత చంపై సోరెన్ గురువారం మధ్యాహ్నం 5 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను సీపీ రాధాకృష్ణన్‌ను కలుసుకున్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖను గవర్నర్‌కు ఆయన అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు.
రాంచీ: రెండ్రోజులుగా జార్ఖాండ్ (Jharkhand) ప్రభుత్వంలో తలెత్తిన ప్రతిష్ఠంభన కొలిక్కి వస్తోంది. భూ ఆక్రమణల కేసులో ఈడీ విచారణను ఎదుర్కొన్న హేమంత్ సోరెన్ (Hemant Soren) తన సీఎం పదవికి రాజీనామా చేయడం, వెంటనే ఈడీ అరెస్టు చేయడం, జ్యుడిషియల్ కస్టడీకి పీఎంఎల్ఏ కోర్టు ఆదేశించడం వంటి పరిణామాల మధ్య జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేత చంపై సోరెన్ (Champai Soren) గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను సీపీ రాధాకృష్ణన్‌ను కలుసుకున్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు.
గవర్నర్‌తో సమావేశానంతరం మీడియాతో చంపైసోరెన్ మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాల్సిందిగా తాము గవర్నర్‌ను కలిసి కోరినట్టు చెప్పారు. గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ''ప్రస్తుతం మాకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందుకు సంబంధించిన రిపోర్ట్‌ను గవర్నర్‌కు సమర్పించాం. ఆ సంఖ్య 46 నుంచి 47కు చేరుతుంది. ఎలాంటి సమస్య లేదు. మా ఘట్‌బంధన్ చాలా పటిష్టంగా ఉంది'' అని చంపై సోరెన్ తెలిపారు.