Cheetah: వామ్మో.. ఆలయ రహదారిలో చిరుత సంచారం.. భక్తుల్లో భయాందోళన
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:18 PM
కోయంబత్తూరు జిల్లాలోని మరుదమలై మురుగన్ ఆలయం, అనువావి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం(Subrahmanya Swamy Temple) రహదారిలో చిరుత సంచరిస్తుండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు పోలీసులు ఆంక్షలు విధించారు.
చెన్నై: కోయంబత్తూరు జిల్లాలోని మరుదమలై మురుగన్ ఆలయం, అనువావి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం(Subrahmanya Swamy Temple) రహదారిలో చిరుత సంచరిస్తుండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. కోయంబత్తూరు జిల్లాలోని ఆనైకట్టి, తటాకం, పేరూరు, మరుదమలై, పోలువరంపట్టి, మదుక్కడై తదితర ప్రాంతాల్లో ఏనుగులు, చిరుతలు తదితర వన్యమృగాలు అధికంగా సంచరిస్తున్నాయి. రెండు రోజులకు ముందు మరుదమలై ఆలయ రహదారిలో చిరుత నింపాదిగా నడిచి వెళుతుండగా స్థానికులు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇదేవిధంగా అనువావి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లే రహదారిలోనూ ఏనుగులు, చిరుతలు సంచరిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఈ పరిస్థితులలో మరుదమలై ఆలయ రహదారిలో కాలినడకగా వెళ్లే భక్తులపై పోలీసులు కొత్త ఆంక్షలు విధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా మరుదమలై ఆలయ రహదారిలో రోజూ ఉదయం 6గంటల నుండి రాత్రి 7 గంటల వరకే భక్తులను, వారి వాహనాలను అనుమతించనున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.