Share News

Chennai: కానుంపొంగల్‌కు 3వేల మంది పోలీసులతో భద్రత

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:08 AM

నగరంలో ఈనెల 17న కానుం పొంగల్‌కు మెరీనా బీచ్‌(Marina Beach)ను లక్షలాదిమంది ప్రజలు సందర్శించనుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడువేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత కల్పించనున్నారు.

Chennai: కానుంపొంగల్‌కు 3వేల మంది పోలీసులతో భద్రత

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలో ఈనెల 17న కానుం పొంగల్‌కు మెరీనా బీచ్‌(Marina Beach)ను లక్షలాదిమంది ప్రజలు సందర్శించనుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడువేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత కల్పించనున్నారు. యేటా సంక్రాంతి, పశువుల పండుగ ముగిసిన తర్వాత చెన్నైలో కానుంపొంగల్‌ను ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆ రోజున గ్రామీణ ప్రజలు నదీ తీరాలలో పిల్లాపాపలతో గుమికూడి సందడి చేస్తుంటారు. ఆ ప్రాంతాల వద్ద వివిధ రకాలైన వంటలను వండుకుని ఆరగిస్తారు. అయితే రాజధాని నగరంలో చెన్నైలో కానుంపొంగల్‌ రోజు సాయంత్రం నగరవాసులంతా మెరీనా బీచ్‌ని సందర్శి స్తుంటారు. బీచ్‌లో లక్షలాదిమంది గుమికూడి ఆటపాటలతో సందడి చేస్తారు. దుకాణాల్లో తినుబండారాలను కొని ఆరగిస్తుంటారు. బాలబాలికలు రంగుల రాట్నాలెక్కి తిరుగుతారు. యువకులు గుర్రాలెక్కి సవారీ చేస్తారు. బొమ్మలాటలు కూడా ఆడుతారు. ఈ వేడుకల సందర్భంగా గుమికూడే జనానికి గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ సందీప్ రాయ్‌ రాథోడ్‌(Greater Chennai Police Commissioner Sandeep Roy Rathore) స్వీయ పర్యవేక్షణలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. అడిషనల్‌ కమిషనర్‌ ప్రేమానంద్‌సిన్హా, డిప్యూటీ కమిషనర్‌ ధర్మరాజ్‌ తదితర సీనియర్‌ పోలీసు అధికారులు మెరీనా బీచ్‌ లైట్‌హౌస్‌ నుంచి అన్నాదురై సమాధి ప్రాంతం వరకు తీరం పొడవునా ఏర్పాటు చేయాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

అదే సమయంలో సంక్రాంతి నుంచి కానుంపొంగల్‌ దాకా మెరీనా బీచ్‌లో సందర్శకులు సముద్రంలో స్నానం చేయకుండా కట్టుదిట్టం చేయనున్నారు. బీచ్‌ అంతటా వాచ్‌ టవర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. డ్రోన్ల ద్వారా జనం కదలికలపై పోలీసులు నిఘా వేయనున్నారు. కానుం పొంగల్‌ రోజు సాయంత్రం ఎవరూ సముద్ర స్నానానికి వెళ్లకుండా కొయ్యలతో బ్యారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇదే విధంగా కానుం పొంగల్‌ రోజున నగరవాసులు గిండీ చిల్డ్రన్స్‌ పార్కు, అన్నా ఫ్లైఓవర్‌ సమీపంలోని సెమ్మొళి పూంగా తదితర ఉద్యాన వనాలలను కూడా సందర్శిస్తుంటారు. దీంతో ఆ ప్రాంతాల వద్ద కూడా పోలీసులు భద్రతా విధులు నిర్వర్తించనున్నారు. ఈ నెల 16 నుంచి 17 వరకు నగరమంతటా సుమారు 16 వేల మంది పోలీసులతో భద్రత కల్పించనున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సందీప్ రాయ్‌ రాథోడ్‌ తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 08:08 AM