Chinese Visa Scam case: కార్తీ చిదంబరంపై ఈడీ ఛార్జిషీటు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ABN , Publish Date - Feb 26 , 2024 | 04:29 PM
చైనీస్ వీసా కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటుపై తీర్పును ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. మార్చి 16వ తేదీకి తీర్పును ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: చైనీస్ వీసా కేసు (Chinese Visa case)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం (Karti Chidambaram), ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన చార్జిషీటుపై తీర్పును ఢిల్లీ హైకోర్టు (Delhi High Curt) సోమవారంనాడు రిజర్వ్ చేసింది. మార్చి 16వ తేదీకి తీర్పును ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ వాయిదా వేశారు.
కార్తీ చిదంబరం, ఎస్.భాస్కరరామన్, మరి కొందరు వ్యక్తులు, సంస్థల పేర్లను ఈడీ తన ఛార్జిషీట్‌లో చేర్చింది. ఈ కేసులో కార్తీ చిదంబరం గతంలో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కేసు విచారణలో ఉన్నందున ఎలాంటి చర్యలకు పాల్పడమని ఈడీ తరఫున హాజరైన ఏఎస్‌జీ ఎస్వీ రాజు కోర్టుకు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్తీ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తన వాదన వినిపిస్తూ, నిందితుడు మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఆయన ఎలాంటి డబ్బులు తీసుకోలేదని, అసలు మనీ అన్నదే లేనప్పుడు లాండరింగ్ అనే మాటే ఉండదని అన్నారు. అయినప్పటికీ ఈసీఐఆర్ నమోదు చేశారని, నిందితుడు సైతం విచారణకు సహకరిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. 2011లో లావాదేవీలు జరిగినట్టు ఆరోపిస్తూ కేసు రిజిస్ట్రేషన్ మాత్రం 2022లో చేశారని ఆయన వాదించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పది రోజుల్లోనే ఈసీఐఆర్ నమోదైనందున కార్తీ అరెస్టుపై ఆందోళనలు ఉన్నాయన్నారు. లావాదేవీలు జరిగాయని చెబుతున్న మొత్తం రూ.50 లక్షలనీ, కోటి కంటే తక్కువని, వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని బెయిలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఏఎస్‌జీ ఎస్వీ రాజు తన వాదన వినిపిస్తూ, ఈ కేసులో ఎలాంటి మెటీరియల్ లేనందున బెయిల్ అప్లికేషన్ అనేది ప్రీమెచ్యూర్ అవుతుందని అన్నారు. కేసు విచారణ జరుగుతోందని, ఎలాంటి కేసు లేనప్పుడు అరెస్టు చేస్తారనే భయం నిందితులకు ఎందుకని ప్రశ్నించారు. ఇంతవరకూ ఎలాంటి సమన్లు ఇవ్వలేదని, కేవలం ఈసీఐఆర్ మాత్రమే నమోదు చేశామని, అందువల్ల అరెస్టు చేస్తారనే భయాలు సహేతుకం కాదని ఆయన తన వాదన వినిపించారు. దీంతో కార్తి చిదంబరం, ఎస్.భాస్కరరామన్, వికాస్ మఖరియా దాఖలు చేసిన మూడు అప్లికేషన్లను రౌస్ అవెన్యూ కోర్టు 2022 జూన్ 3న కొట్టివేసింది.