CM Siddaramaiah: బాంబు పేలుడు ఘటన.. ఆ పనులు మానుకోవాలంటూ బీజేపీపై సీఎం ఫైర్
ABN , Publish Date - Mar 03 , 2024 | 08:19 PM
బ్రాండ్ బెంగళూరుని బాంబు బెంగళూరుగా మార్చారని, రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Blast) కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency - NIA)కు అప్పగించాలని బీజేపీ (BJP) చేసిన వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తీవ్రంగా స్పందించారు.
బ్రాండ్ బెంగళూరుని బాంబు బెంగళూరుగా మార్చారని, రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Blast) కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency - NIA)కు అప్పగించాలని బీజేపీ (BJP) చేసిన వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ప్రస్తుతం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (Central Crime Branch - CCB) దర్యాప్తు జరుపుతోందని.. అవసరమైతే ఈ కేసుని ఎన్ఐఏకు అప్పగించే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. బాంబు పేలుడు లాంటివి చిన్న ఘటనలు కావని.. ఇలాంటి వాటిపై రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేయడం బీజేపీ మానుకోవాలని గట్టిగా సూటించారు.
బ్రాండ్ బెంగళూరుని బాంబు బెంగళూరుగా మార్చారని బీజేపీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘‘బీజేపీ హయాంలో నాలుగు బాంబు పేలుళ్ల ఘటనలు చోటు చేసుకున్నాయి. మరి దాన్ని ఏమని పిలవాలి? మంగళూరు కుక్కర్ పేలుడు జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయం ముందే పేలుడు సంభవించినప్పుడు, ఎవరు పాలిస్తున్నారు? NIA, IB ఇన్‌ఛార్జ్‌లు ఎవరు? ఇది వారి వైఫల్యం కాదా?’’ అని విరుచుకుపడ్డారు. తాను బాంబు పేలుడు ఘటనకు మద్దతివ్వడడం లేదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కానీ.. దీనిపై బీజేపీ రాజకీయాలు చేయడం మానెయ్యాలని ఉద్ఘాటించారు. బాంబు పేలుడు వంటివి సిల్లీ ఘటనలు కావని, ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వాలు ఎప్పుడూ సీరియస్‌గానే చర్యలు తీసుకున్నాయని.. ప్రజల భద్రత చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో.. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కర్ణాటక (Karnataka) ప్రతిష్టను దిగజార్చిందని డిప్యూటీ సీఎం శివకుమార్ (Dy CM DK Shivakumar) కూడా మండిపడ్డారు. రాజకీయ మైలేజ్ పొందడం కోసం ఈ అంశాన్ని బీజేపీ వాడుకుంటోందని.. ఈ క్రమంలో బెంగళూరుతోపాటు కర్ణాటక ప్రతిష్టను దిగజార్చుతోందని ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలో జరిగిన ఘటనల్ని వాళ్లు మరిచిపోయి ఉండొచ్చని, అయితే వాటిపై రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఇలాంటి సమయాల్లో వారు దేశ ఐక్యత, సమగ్రత, శాంతి గురించి తెలుసుకోవాలని అన్నారు. బీజేపీ నాయకులకు ప్రాథమిక అవగాహన లేదని.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారెవరూ ‘బాంబు బెంగళూరు’ వంటి మాటలు మాట్లాడరని కౌంటర్ ఇచ్చారు.