Vande Bharat Express: వందేభారత్ రైలులో సేమ్ సీన్ రిపీట్.. భోజనంలో బొద్దింక.. భారీ పెనాల్టీ
ABN , First Publish Date - 2024-02-06T18:18:13+05:30 IST
ప్రయాణికులకు ఉత్తమమైన, మెరుగైన సేవలు అందించేందుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. ఇది మాత్రం ఏదో ఒక ఫిర్యాదుతో వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా.. ఈ రైలులో వడ్డించే ఆహారం విషయంలో ప్రయాణికుల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి
ప్రయాణికులకు ఉత్తమమైన, మెరుగైన సేవలు అందించేందుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. ఇది మాత్రం ఏదో ఒక ఫిర్యాదుతో వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా.. ఈ రైలులో వడ్డించే ఆహారం విషయంలో ప్రయాణికుల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. దుర్వాసన రావడం, బొద్దింకలు లేదా ఇతర కీటకాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రయాణికుడి భోజనంలోనూ బొద్దింక వచ్చింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆ ప్రయాణికుడు పంచుకోగా.. IRCTC వెంటనే బదులిస్తూ సారీ చెప్పింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 1వ తేదీన శుభేందు కేశరి అనే ప్రయాణికుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాడు. రాణి కమలపాటి నుంచి జబల్‌పూర్‌కి వెళ్తున్న ఆయన.. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనాన్ని తినేందుకు ప్యాకెట్ ఓపెన్ చేశాడు. అది ఓపెన్ చేయగానే ఆయనకు భోజనంలో బొద్దింక కనిపించింది. అది చూసి ఖంగుతిన్న శుభేందు.. వెంటనే ఆ దృశ్యాల్ని తన ఫోన్‌లో క్లిక్‌మనిపించి, సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేశాడు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో IRCTC ఇచ్చిన భోజనం ప్యాకెట్‌లో చనిపోయిన బొద్దింక ఉండటం చూసి తాను ఆందోళన చెందానని తన పోస్టులో రాసుకొచ్చాడు.
ఈ ఘటనపై IRCTC వెంటనే స్పందిస్తూ క్షమాపణలు చెప్పింది. అలాగే.. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై భారీ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. ‘‘మీకు ఎదురైన ఈ అనుభవానికి మేము క్షమాపణలు చెప్తున్నాం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై భారీ జరిమానా విధించబడింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా.. పర్యవేక్షణను బలోపేతం చేయడం జరిగింది’’ అంటూ IRCTC తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. కాగా.. వందేభారత్ రైలులో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది జులైలో ఓ ప్రయాణికుడి భోజనంలోనూ బొద్దింక వచ్చింది. అప్పుడు కూడా IRCTC ఇలాగే బదులిచ్చింది.