స్వయంకృతం
ABN , Publish Date - Oct 10 , 2024 | 05:51 AM
హరియాణాలో గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ ఓడిపోవటం ఆ పార్టీ స్వయంకృతమని ఇండియా కూటమి పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకొని ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని పేర్కొన్నాయి. శివసేన (యూబీటీ) స్పందిస్తూ..
హరియాణాలో కాంగ్రెస్ ఓటమిపై ఇండియా కూటమి పార్టీల విమర్శలు
విజయాన్ని అపజయంగా ఎలా
మల్చుకోవచ్చో కాంగ్రెస్‌ను చూసి నేర్చుకోవాలి
అతివిశ్వాసం, వర్గపోరు ఓడించింది: శివసేన
వ్యూహాల్ని కాంగ్రెస్ సమీక్షించుకోవాలి: సీపీఐ
అహంకారంతోనే ఓటమి: తృణమూల్
కలిసి పోటీ చేస్తే ఫలితం వేరుగా ఉండేది
ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: ఆప్
ఈవీఎంల హ్యాకింగ్.. ఈసీతో కాంగ్రెస్ భేటీ
న్యూఢిల్లీ, అక్టోబరు 9: హరియాణాలో గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ ఓడిపోవటం ఆ పార్టీ స్వయంకృతమని ఇండియా కూటమి పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకొని ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని పేర్కొన్నాయి. శివసేన (యూబీటీ) స్పందిస్తూ.. విజయాన్ని అపజయంగా ఎలా మల్చుకోవచ్చో కాంగ్రె్‌సను చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేసింది. చేతికందివచ్చిన విజయాన్ని చేజేతులా దూరం చేసుకుందని దుయ్యబట్టింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామనాలో బుధవారం సంపాదకీయంలో తీవ్ర విమర్శలు చేసింది. ‘హరియాణాలో కాంగ్రెస్ అపజయానికి కారణం ఆ పార్టీ ప్రదర్శించిన అతివిశ్వాసం. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక వాతావరణం ఏ స్థాయిలో ఉందంటే.. పలు గ్రామాల్లోకి ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు, మంత్రులు వెళ్లటానికి కూడా సాహసించలేదు. స్థానికులు వారు రాకుండా అడ్డుకున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇటువంటి సానుకూల పరిస్థితి ఉన్నా కూడా కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది’ అని పేర్కొంది. హరియాణా కాంగ్రె్‌సలో ఉన్న వర్గపోరు కూడా ఆ పార్టీ కొంపముంచిందని తెలిపింది. కీలకనేతగా ఉన్న కుమారి షెల్జాను భూపీందర్‌సింగ్ హుడా, ఆయన అనుచరులు బహిరంగంగా అవమానిస్తున్నా కూడా పార్టీ అధిష్ఠానం అడ్డుకోలేదని వెల్లడించింది. ఇతర కాంగ్రెస్ నేతలతో హుడా సహాయనిరాకరణ, అభ్యర్థులను తన ఇష్టానుసారం ఎంపిక చేయటం కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలని తెలిపింది. కాంగ్రె్‌సలో ఎప్పుడూ ఇలాగే ఉంటుందని పేర్కొంటూ గత ఏడాది జరిగిన ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను సామనా ప్రస్తావించింది. ఆ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదని, కానీ, ముఠా రాజకీయాల కారణంగా కాంగ్రెస్ విజయాన్ని జారవిడుచుకుందని విశ్లేషించింది. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్‌రౌత్ కూడా హరియాణా ఫలితంపై స్పందిస్తూ.. ఇండియా కూటమి పార్టీలైన ఎస్పీ, ఆప్‌లతోపాటు ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఉంటే కాంగ్రెస్ గెలిచి ఉండేదన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రకటించాలని, అప్పుడు ఇండియా కూటమి పార్టీలు కూడా తమ రాష్ట్రాల్లో తమవైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటాయన్నారు. బీజేపీ బాగా పోరాడిందని, ఓడిపోయే యుద్ధాన్ని కూడా గెల్చుకుందని అభినందనలు తెలిపారు.
ఏ ఎన్నికనూ తేలిగ్గా తీసుకోవద్దు: కేజ్రీవాల్
ఏ ఎన్నికనూ తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి నియోజకవర్గంలోనూ విజయం కోసం శాయశక్తులా పోరాడాలని.. హరియాణా ఎన్నికల పలితం నేర్పే పాఠం ఇదేనని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇండియా కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయటం వల్లనే కాంగ్రెస్ పరాజయం పాలైందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే కాంగ్రె్‌సపై విమర్శలు సంధించారు. ‘ఈ రకమైన అహంకారమే ఎన్నికల్లో ఓటమికి కారణమవుతుంది. ఏదైనా రాష్ట్రంలో గెలిచే పరిస్థితులు ఉంటే అక్కడి స్థానిక పార్టీతో పొత్తు పెట్టుకోం. పార్టీ బలంగా లేని రాష్ట్రాల్లో మాత్రం స్థానిక పార్టీ మనకు సీట్లు ఇవ్వాలి. నేర్చుకోండి’ అంటూ కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు.
మా పోరాటాన్ని కొనసాగిస్తాం: రాహుల్
న్యూఢిల్లీ, హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జమ్ము, కశ్మీర్‌లో ఇండియా కూటమి గెలుపుని భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య, ఆత్మగౌరవ విజయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అభివర్ణించారు. హరియాణాలో ఊహించని విధంగా వచ్చిన ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నట్లు బుధవారం ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. జమ్ము, కశ్మీర్, హరియాణా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రజల గళాన్ని వినిపిస్తామని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాల వల్లే బీజేపీ విజయం సాధించిందని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ఢిల్లీలో కాంగ్రె్‌సతో పొత్తు ఉండదు: ఆప్
న్యూఢిల్లీ, అక్టోబరు 9: త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. కాంగ్రెస్ అతి విశ్వాసంతో హరియాణాలో సీట్ల సర్దుబాటుకు విఘాతం కలిగించడం వల్లే అక్కడ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని విమర్శించింది. హరియాణాలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉన్నప్పటికీ బీజేపీ వరుసగా మూడోసారి అక్కడ గెలుపొందడానికి కారణమదేనని తేల్చిచెప్పింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా హరియాణాలో ఓటమిపై కాంగ్రెస్ తీరును నిందించారు.