JP Nadda: కాంగ్రెస్‌ను 'రాజకీయ పరాన్నజీవి'గా పోల్చిన నడ్డా
ABN , Publish Date - Jul 19 , 2024 | 09:15 PM
కాంగ్రెస్ పార్టీ 'రాజకీయ పరాన్నజీవి'గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇతర పార్టీల బలంపై ఆధారపడటం, ఇతర పార్టీల సహకారంతో, 'కూటమి' ఓట్లతో ఉనికి కాపాడుకుంటోందని విమర్శించారు. ఒడిశాలోని పూరీలో జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివివ్ కమిటీ సమావేశంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.
పూరి: కాంగ్రెస్ (Congress) పార్టీ 'రాజకీయ పరాన్నజీవి' (Political Parasite)గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. ఇతర పార్టీల బలంపై ఆధారపడటం, ఇతర పార్టీల సహకారంతో, 'కూటమి' ఓట్లతో ఉనికి కాపాడుకుంటోందని విమర్శించారు. ఒడిశాలోని పూరీలో జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివివ్ కమిటీ సమావేశంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.
''కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరాన్నజీవి. సొంతకాళ్లపై నిలబడే సత్తాలేక ఇతరుల బలంతో నిలబడుతోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 64 లోక్‌సభ సీట్లున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ ముఖాముఖీ తలబడ్డాయి. బీజేపీ 62 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్ కేవలం 2 సీట్లలోనే నెగ్గింది. వారు గెలిచిందెక్కడ? ఇతర పార్టీల బలంపై ఆధారపడే గెలిచారు. ప్రాంతీయ పార్టీలు మద్దతివ్వని చోట్ల వాళ్లు జీరోగానే మిగిలారు'' అని నడ్డా అన్నారు.
Yogi Kanwar orders: కన్వర్ యాత్రపై యోగి వివాదాస్పద ఆదేశాలు.. భగ్గుమన్న సొంతపార్టీ నేతలు
13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ జీరో..
కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాల్లో జీరోగా నిలిచిందని నడ్డా వివరించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, ఢిల్లీ, అండమాన్ నికోకార్, దాద్రా అండ్ నగర్ హవేలి, లఢక్‌లలో కాంగ్రెస్ పార్టీ జీరో అని చెప్పారు. అయినప్పటికీ తామేదో గెలుపు సాధించినట్టు ఆ పార్టీ చెప్పుకుంటోందని అన్నారు. 'ఇండియా' కూటమి మొత్తం కలుపుకొన్నా బీజేపీదే పైచేయి అని తెలిపారు.