Share News

పీవీని కాదని.. మన్మోహన్‌కు ఔనని..

ABN , Publish Date - Dec 28 , 2024 | 06:03 AM

Congress Honors Manmohan Singh While Overlooking P.V. Narasimha Rao's Legacy

పీవీని కాదని.. మన్మోహన్‌కు ఔనని..

ఏఐసీసీ కార్యాలయంలోకి పీవీ భౌతికకాయం రాకుండా నాడు గేట్లు మూసేసిన కాంగ్రెస్‌ పార్టీ

మన్మోహన్‌కు రాజ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

కార్యకర్తల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచుతామని వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక పతనం అంచున ఉన్న దేశాన్ని గాడిన పెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఇవ్వని గౌరవాన్ని.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌కు ఇస్తోంది! పీవీ చనిపోయినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని సైతం ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా గేట్లు మూసేసిన కాంగ్రెస్‌ పార్టీ.. పీవీ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు పంపి అంత్యక్రియలు చేయించిన అధిష్ఠానం.. ఇప్పుడు రాజ్‌ఘాట్‌లో మన్మోహన్‌ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించాలని, అక్కడ ఆయన ప్రత్యేక స్మారకస్థలిని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది! వీపీ సింగ్‌, మొరార్జీ దేశాయ్‌, పీవీ నరసింహారావు మినహా.. దేశ మాజీ ప్రధానులందరి అంత్యక్రియలూ ఢిల్లీలోనే జరిగిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండీ అంత కఠినంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ పార్టీ.. మన్మోహన్‌ విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పార్టీ కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్‌ సింగ్‌ భౌతిక కాయాన్ని శనివారం ఉదయం 8-30 నుంచి 9-30 వరకు ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఉంచుతామని.. 9.30కి అంతిమయాత్ర మొదలవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం ధ్రువీకరించారు. యమునా నది ఒడ్డున ఉన్న రాజ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా శుక్రవారం కేంద్రాన్ని కూడా కోరినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్పాయి.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వయంగా ఈ విజ్ఞప్తి చేశారు. అనంతరం.. మన్మోహన్‌కు అంత్యక్రియలు నిర్వహించిన చోటులోనే స్మారకాన్ని కూడా నిర్మించాలని కోరుతూ రెండు పేజీల లేఖ రాశారు. రెండుసార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్‌కు దేశ ప్రజల హృదయాల్లో అత్యంత గౌరవనీయస్థానం ఉందని, ఆయన సాధించిన విజయాలు, దేశానికి చేసిన సేవలు అపూర్వమని ఖర్గే ఆ లేఖలో గుర్తుచేశారు. మాజీ ప్రధానులకు అంత్యక్రియలు జరిగిన చోటే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయం ఉందని గుర్తుచేశారు. అలాగే.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాధ్రా, కేసి వేణుగోపాల్‌ ప్రత్యేకంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి ఈ మేరకు అభ్యర్థించారు. రాజ్‌ఘాట్‌లో ఒక్కొక్కరికీ ప్రత్యేక స్మారక స్థలం ఏర్పాటు చేసేందుకు స్థలం సరిపోనందువల్ల.. రాష్ట్రీయ స్మృతిస్థల్‌లోమాజీ ప్రధానుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని 2013లో యూపీఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలకు రాజ్‌ఘాట్‌లో ప్రత్యేక స్మారక స్థలం కావాలని కాంగ్రెస్‌ పార్టీ స్వయంగా కోరడం గమనార్హం. అంతేనా.. మన్మోహన్‌కు ప్రత్యేకంగా స్మారకస్థలిని నిర్మించకపోవడమంటే దేశ తొలి సిక్కు ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - Dec 28 , 2024 | 06:03 AM