AAP: కేజ్రీవాల్‌పై కుట్ర, జైలులో ఏదైనా జరగొచ్చు.. ఆప్ ఎంపీ సంచలన ఆరోపణ
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:27 PM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్జీ, ఈడీ, తీహార్ జైలు అధికారులపై కూడా ఆయన అరోపణలు గుప్పించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) సంచలన ఆరోపణలు చేశారు. ఎల్జీ, ఈడీ, తీహార్ జైలు అధికారులపై కూడా ఆయన అరోపణలు గుప్పించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఆయనపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సంజయ్ సింగ్ చెప్పారు.
‘ఆమ్’ ఆద్మీ..!
కేజ్రీవాల్ మధుమేహం వ్యాధితో భాదపడుతున్నప్పటికీ సకాలంలో 'ఇన్సులిన్' ఇవ్వడం లేదని సింగ్ తెలిపారు. పైగా కేజ్రీవాల్ అస్వస్థతతో బాధపడుతుంటే బీజేపీ నేతలు 'అపహాస్యం' చేస్తూ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని అన్నారు. జైలులో ఉన్న వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం షేర్ చేయడానికి జైలు రూల్స్ ఒప్పుకోనప్పుడు, కేజ్రీవాల్ నకిలీ డైట్ చార్ట్‌ను మీడియా ముందు ఈడీ ఎలా పబ్లిసైజ్ చేసిందని సింగ్ ప్రశ్నించారు. ఆయనకు విషం ఇచ్చే కుట్ర జరుగుతోందా? అని నిలదీశారు. కేజ్రీవాల్‌కు జైలులో ఏ సమయంలోనైనా ప్రమాదం జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ముఖ్యమంత్రిని జైలులోనే చంపేందుకు కుట్ర జరుగుతోందని ఢిల్లీ మంత్రి అతిషి సైతం గురువారంనాడు ఆరోపించారు. ఆమె ఆరోపణకు ముందు ఈడీ తన వాదనను కోర్టు ముందు వినిపిస్తూ, టైప్-2 డయాబెటిస్ ఉన్నప్పటికీ మెడికల్ బెయిల్ లేదా ఆసుపత్రికి తనకు షిప్ట్ చేసేందుకు వీలుగా కేజ్రీవాల్ మామిడిపళ్లు, అరటిపండ్లు వంటి హై-షుగర్ ఆహారం తీసుకుంటున్నారని తెలిపింది.