Share News

National : ఒలింపిక్స్‌పై కుట్ర

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:14 AM

ప్రపంచం నలుమూలల నుంచీ అత్యుత్తమ క్రీడాకారులందరూ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పారిస్‌ మహానగరానికి వచ్చిన వేళ.. ఆ క్రీడా సంబరాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచ్‌ హైస్పీడ్‌ రైల్‌ (టీజీవీ) నెట్‌వర్క్‌పై వరుస దాడులు చేశారు.

National : ఒలింపిక్స్‌పై కుట్ర

  • ఫ్రాన్స్‌లో హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌పై దాడులు

  • ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలకు ముందు ఐదు కీలక ప్రాంతాల్లో పట్టాల ధ్వంసం

  • రైల్వే కేబుళ్లు, సిగ్నల్‌ బాక్సులకు నిప్పు

  • వామపక్ష తీవ్రవాదులు, పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు

  • ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలకు ముందు ఐదు కీలక ప్రాంతాల్లో

  • పట్టాల ధ్వంసం.. రైల్వే కేబుళ్లు, సిగ్నల్‌ బాక్సులకు నిప్పు

ప్రపంచం నలుమూలల నుంచీ అత్యుత్తమ క్రీడాకారులందరూ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పారిస్‌ మహానగరానికి వచ్చిన వేళ.. ఆ క్రీడా సంబరాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచ్‌ హైస్పీడ్‌ రైల్‌ (టీజీవీ) నెట్‌వర్క్‌పై వరుస దాడులు చేశారు. పారిస్‌ నగరాన్ని దేశంలోని నలుమూలలకూ అనుసంధానం చేసే ట్రాకులను లక్ష్యంగా చేసుకున్నారు. తెల్లవారితే శుక్రవారం అనగా రాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 5.30 గంటలవరకూ విధ్వంసం సృష్టించారు. కొన్నిచోట్ల పట్టాలను ధ్వంసం చేశారు.

కొన్నిచోట్ల సిగ్నల్‌ బాక్సులకు నిప్పుపెట్టారు. కేబుళ్లను ముక్కలు ముక్కలు చేసి తగలబెట్టారు. ఈ అనూహ్యదాడులతో చాలా రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని రైళ్లను దారి మళ్లించామని ఫ్రాన్స్‌ రైల్వే వ్యవస్థ ఎస్‌ఎన్‌సీఎ్‌ఫ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘మా టీజీవీ నెట్‌వర్క్‌ను స్తంభింపజేసేందుకు పెద్ద ఎత్తున జరిపిన దాడి ఇది’’ అని పేర్కొంది. ముఖ్యంగా.. ఈ నెట్‌వర్క్‌లో అత్యంత కీలకమైన ఐదు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్టు వివరించింది.


ఈ ఐదు ప్రాంతాలూ పారి్‌సను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఉన్న నాలుగు ప్రధాన నగరాలను కలిపే కీలకమైన స్ట్రాటజిక్‌ నెర్వ్‌ సెంటర్స్‌ అని వెల్లడించింది. పెద్ద సంఖ్యలై రైళ్లు రద్దుకావడం, దారి మళ్లడంతో పలు రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడిపోయాయి.

అథ్లెట్లు, సాధారణ ప్రయాణికులు కలిపి.. 80 వేలమందికి పైగా ఈ అంతరాయంతో ఇబ్బంది పడ్డారు. కాగా.. ఈ దాడులపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. దాడులు ఎవరి పని అనే విషయం ఇప్పటివరకూ తెలియనప్పటికీ.. వామపక్ష తీవ్రవాదులు, అరాచకవాదులే ఈ దాడులకు పాల్పడినట్టు నిఘా వర్గాలు తెలిపాయంటూ ఫ్రెంచ్‌ మీడియా కథనాలను ప్రచురించింది.

అదే సమయంలో.. ఇది పర్యావరణ ఆందోళనకారుల పనేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడినందుకు నిరసనగా రష్యాను ఈ ఒలింపిక్స్‌కు ఆహ్వానించలేదని, కాబట్టి ఈ దాడుల వెనుక పుతిన్‌ హస్తాన్నీ కొట్టిపారేయలేమని కొందరు భద్రతా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని ఫుట్‌బాల్‌ మ్యాచులు సహా.. పలు ఈవెంట్లు పారిస్‌ నగరానికి ఆవల జరగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి ఇప్పటికే రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నవారి ప్రణాళికలు శని, ఆదివారాల్లో ఈ మార్గంలో తిరగాల్సిన రైళ్లలో నాలుగోవంతు రైళ్లను రద్దు చేశారు.

-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Jul 27 , 2024 | 05:14 AM