Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండెపోట్లు సంభవిస్తున్నాయా.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే?
ABN , Publish Date - Mar 02 , 2024 | 09:21 PM
కొవిడ్ లాక్‌డౌన్ (Covid Lockdown) తర్వాత గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో.. కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandavia) తెలిపారు.
కొవిడ్ లాక్‌డౌన్ (Covid Lockdown) తర్వాత గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో.. కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandavia) తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (Indian Council of Medical Research - ICMR) నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్‌లు కారణం కాదని అన్నారు.
శనివారం ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో (ANI Dialogues 2024) మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. ఈరోజుల్లో ఎవరికైనా గుండెపోటు వచ్చిందంటే దానికి కొవిడ్ వ్యాక్సిన్ కారణమని భావిస్తున్నారని, అయితే గుండెపోటుకు వ్యాక్సిన్ బాధ్యత వహించదని ICMR ఒక వివరణాత్మక అధ్యయనం చేసిందని చెప్పారు. గుండెపోటుకి ఆ వ్యక్తుల లైఫ్‌స్టైల్ (Lifestyle), పొగాకు (Smoking), మద్యపానం (Alcohol) వంటి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. కొన్నిసార్లు తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాపిస్తుందని, అప్పుడు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఏదేమైనా.. గుండెపోటుకి కొవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఇదిలావుండగా.. కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరుగుతోందని ఆందోళనలు వ్యక్తమైన తరుణంలో ICMR ఒక అధ్యయనం నిర్వహించింది. వ్యక్తుల జీవనశైలి, కొన్ని అలవాట్లు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు.. గుండెపోటుకు అంతర్లీన కారణాలు కావొచ్చని ఆ అధ్యయనం తెలిపింది. రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ ఆకస్మిక మరణాల సంఖ్యను తగ్గించిందని కూడా తేల్చింది. అయితే.. కొవిడ్-19 గుండె జబ్బులు, స్ట్రోక్‌ను ప్రమాదాన్ని పెంచుతుందని ఈ స్టడీ అంగీకరించింది. గుండెపోటుకు వ్యాక్సిన్ కారణం కాదని తేల్చిన ఈ స్టడీ.. ధూమపానం, అతిగా మద్యపానం సేవించడం, మాదకద్రవ్యాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమ వంటి జీవనశైలి వల్ల గుండెపోటు సంభవిస్తుందని వెల్లడించింది.