CM Aravind Krjriwal :నేను జైలుకు వెళ్లకూడదంటే చీపురుకు ఓటేయండి
ABN , Publish Date - May 17 , 2024 | 03:55 AM
తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ వినతి
అమృత్‌సర్, మే 16: తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ‘‘మీరు ఝాడూ మీటను నొక్కితే నేను జైలుకు వెళ్లాల్సిన పని ఉండదు’’ అని అన్నారు. కేజ్రీవాల్‌కు స్వేచ్ఛ ఇచ్చేందుకు బటన్ నొక్కుతారో, జైలుకు పంపించేందుకు నొక్కుతారో తేల్చుకోవాలని అన్నారు.
చీపురుకు ఓటేస్తే రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడినట్టవుతుందని చెప్పారు. తాను ఢిల్లీలో 2.5 కోట్ల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేసినా తనకు మాత్రం జైలులో 15 రోజుల పాటు ఇన్సులిన్ లభించలేదని అన్నారు.
తన సుగర్ లెవల్ 300 నుంచి 350 పాయింట్లకు పెరిగిందని, ఇది ఇలాగే ఉంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయని చెప్పారు. తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా ఏమి చేయాలని అనుకున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణ మందిరానికి వెళ్లి పూజలు చేశారు.