Share News

Sanjay Singh: రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారానికి రెండోసారి కోర్టు అనుమతి

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:18 PM

ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ పార్లమెంటుకు వెళ్లి రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు రెండోసారి అనుమతించింది. ఫిబ్రవరి 8 లేదా 9వ తేదీల్లో ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మంగళవారంనాడు అనుమతించారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి సంజయ్ సింగ్‌ను తగిన భద్రతతో ప్రమాణస్వీకారానికి తీసుకు వెళ్లాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.

Sanjay Singh: రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారానికి రెండోసారి కోర్టు అనుమతి

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) పార్లమెంటుకు వెళ్లి రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు రెండోసారి అనుమతించింది. ఫిబ్రవరి 8 లేదా 9వ తేదీల్లో ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మంగళవారంనాడు అనుమతించారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి సంజయ్ సింగ్‌ను తగిన భద్రతతో ప్రమాణస్వీకారానికి తీసుకు వెళ్లాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. రాజ్యసభ సెక్రటేరియట్‌కు తగిన సమాచారం ఇవ్వాలని కూడా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలిచ్చారు.


సంజయ్ సింగ్‌ ప్రమాణస్వీకారానికి కోర్టు ఇంతకుమందు అనుమతించినప్పటికీ కొన్ని కారణాల రీత్యా ఆయన ప్రమాణస్వీకారం చేయలేకపోయిన విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుందని, ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఆయనను తిరిగి రాజ్యసభకు తీసుకు వెళ్లాలని కోర్టు స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లపై సంజయ్ సింగ్‌ను కలుసుకుని సంతకాలు తీసుకునేందుకు ఆయన లాయర్‌ను అనుమతిస్తున్నట్టు తెలిపింది. సింగ్ తరఫున అడ్వకేట్ రజత్ భరద్వాజ్, మొహమ్మద్ ఇర్షాద్ కోర్టు ముందు హాజరుకాగా, ఈడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నవీన్ కుమార్ మిత్రా హాజరయ్యారు.


కాగా, దీనికి ముందు ఫిబ్రవరి 5వ తేదీన రాజ్యసభ ఎంపీగా సంజయ్ సింగ్ ప్రమాణస్వీకారానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, బులిటెన్‌లో నోటిఫై చేసిన సభా కార్యక్రమాలను మాత్రమే సభలో చేపడతామని చెబుతూ రాజ్యసభ చైర్‌పర్సన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అభ్యంతరం తెలిపారు. రాజ్యసభకు ఎలాంటి సమాచారం లేదని, ప్రమాణస్వీకార అంశం పరిశీలనలోకి రాలేదని చెప్పారు. దీంతో సింగ్ ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ గత ఏడాది అక్టోబర్ 4న సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును గత వారం రిజర్వ్ చేసింది.

Updated Date - Feb 06 , 2024 | 04:18 PM