Share News

Delhi : ఆండ్రాయిడ్‌ యూజర్లకు హెచ్చరిక!

ABN , Publish Date - Jul 14 , 2024 | 02:58 AM

భారత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సెర్ట్‌ ఇండియా) దేశంలోని ఆండ్రాయిడ్‌ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లు అప్రమత్తం చేసింది.

Delhi : ఆండ్రాయిడ్‌ యూజర్లకు హెచ్చరిక!

  • పలు వ్యవస్థల్లో తీవ్ర లోపాలు.. 12, 12ఎల్‌, 13, 14 వెర్షన్లకు ప్రమాదం

  • హ్యాకర్లు పంజా విసిరే చాన్స్‌.. సెర్ట్‌ హెచ్చరిక

  • ప్యాచ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన

న్యూఢిల్లీ, జూలై 13: భారత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సెర్ట్‌ ఇండియా) దేశంలోని ఆండ్రాయిడ్‌ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లు అప్రమత్తం చేసింది. ఈ కోవలో దిగ్గజ సంస్థలు సామ్‌సంగ్‌, రియల్‌మీ, షామీ, వివో, వన్‌ప్ల్‌స స్మార్ట్‌ఫోన్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని సిస్టమ్‌ ఫ్రేమ్‌వర్క్‌, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్‌డేట్‌లు, కర్నల్‌, ఏఆర్‌ఎం కాంపొనెంట్లు, మీడియాటెక్‌ కాంపొనెంట్లు, క్వాల్కమ్‌ కాంపొనెంట్లు, క్వాల్కమ్‌ క్లోజ్‌-సోర్స్డ్‌ కాంపొనెంట్లలో లొసుగులను గుర్తించినట్లు సెర్ట్‌ వివరించింది.

ఆండ్రాయిడ్‌ వెర్షన్లు 12, 12ఎల్‌, 13, 14లో గుర్తించిన ఈ లొసుగులను ఆసరాగా చేసుకుని, హ్యాకర్లు పంజావిప్పే ప్రమాదముందని హెచ్చరించింది. యూజర్లు అప్రమత్తమవ్వకుంటే.. వారి సున్నితమైన డేటాను హ్యాకర్లు తస్కరించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. పైన పేర్కొన్న వెర్షన్ల ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను వినియోగించే స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు వెంటనే సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.


నైజీరియాలో ఈ నెల 10న ఆండ్రాయిడ్‌లోని లొసుగులతో హ్యాకర్లు 70 వేల స్మార్ట్‌ఫోన్లపై పంజా విసిరినట్లు ఆ దేశ ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం గుర్తించిన ఆండ్రాయిడ్‌ లొసుగుల తీవ్రతను ‘అత్యధికం(హై)’గా పేర్కొంది. హ్యాకర్లు ‘అనస్టా బ్యాంకింగ్‌’ పేరుతో ఈ 70 వేల ఫోన్లలో ట్రోజన్లను చొప్పించారని వివరించింది. ఈ ట్రోజన్‌ ద్వారా యూజర్ల బ్యాంకింగ్‌ వివరాలను కొల్లగొట్టినట్లు గుర్తించినట్లు తెలిపింది.

అప్‌డేట్‌ ఒక్కటే పరిష్కారం

  • ఆండ్రాయిడ్‌ ఫోన్లలో సెక్యూరిటీ ఫీచర్లను అప్‌డేట్‌ చేసుకోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని సెర్ట్‌-ఇండియా, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు..

  • యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. సిస్టమ్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్‌ను, సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

  • పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేశాయి. మిగతావి కూడా ఈ వారంలో వాటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి.

  • ట్రోజన్‌ దాడులను అడ్డుకోవడానికి.. స్మార్ట్‌ఫోన్‌లో ఏవైనా కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్‌ అయ్యాయా? అనే విషయాన్ని గుర్తించి, వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

  • వాట్సాప్‌, సోషల్‌ మీడియా, ఈ-మెయిల్‌ ద్వారా వచ్చే అపరిచిత, అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయకూడదు.

Updated Date - Jul 14 , 2024 | 09:05 AM