IAS Coaching deaths: కోచింగ్ సెంటర్ల రెగ్యులేషన్.. కమిటీ ఏర్పాటు చేసిన ఎల్జీ
ABN , Publish Date - Jul 31 , 2024 | 09:19 PM
దేశరాజధాని ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల రెగ్యులేషన్‌కు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించేందుకు ఒక కమిటీని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బుధవారంనాడు ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల రెగ్యులేషన్‌కు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించేందుకు ఒక కమిటీని లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governer) వినయ్ కుమార్ సక్సేనా (Vinay Kuamr Saxena) బుధవారంనాడు ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ విచారిస్తుంది. పక్కా ప్లానింగ్ ఉన్న ప్రాంతాలకు కోచింగ్ సెంటర్లను తరలించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ కమిటీలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లకు చెందిన ఐదారుగురు ప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉండారు. ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరదనీరు రావడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్ధులు ఈనెల 27న మృతి చెందిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
UPSC aspirants deaths: ఎట్టకేలకు పెదవివిప్పిన రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్
విద్యార్థులను కలిసిన అతిషి
కాగా, కోచింగ్ సెంటర్ ఘటనపై ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో నిరసనలు కొనసాగిస్తున్న విద్యార్థులను ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి బుధవారంనాడు కలుసుకున్నారు. దీంతో విద్యార్థులు 'గో బ్యాక్', 'ఉయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. అయితే మంత్రి ఎంతో అనునయంగా వారితో కలిసి కూర్చుని విద్యార్థులకు బాసటగా ప్రభుత్వం నిలుస్తుందని హామీ ఇచ్చారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను రెగ్యులేట్ చేసేందుకు చట్టం తెస్తామని, ఇందుకు అవసరమైన ముసాయిదా రూపకల్పన చేసే ప్యానల్‌లో 10 మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని, వారి పేర్లు ఇవ్వాలని విద్యార్థులను కోరారు.
Read More National News and Latest Telugu News