Delhi : ఎమర్జెన్సీలో మినహా భేషుగ్గా పార్లమెంటు పనితీరు
ABN , Publish Date - Jul 28 , 2024 | 06:17 AM
ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.
రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూలై 27: ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు. ఎమర్జెన్సీ రోజులను ‘బాధాకరమైన, చీకటి’ కాలంగా అభవర్ణించారు.
రాజ్యసభ కొత్త ఎంపీల పునశ్చరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం మామూలు కాగితం ముక్క అయిపోయిందన్నారు. అంతర్గత భద్రతా చట్టం (మీసా) పేరుతో అమానుషంగా వ్యవహరించారని, నాయకులను జైళ్లలో నిర్బంధించారన్నారు.
అప్పటి దారుణాలకు చలించిపోయిన లాలూప్రసాద్ యాదవ్ తన కుమార్తెకు ‘మీసా’ భారతి’ అని పేరు పెట్టారని గుర్తుచేశారు. ప్రస్తుతం సభ్యులు రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు సమావేశాల్లో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమన్నారు.