Dengue: తమిళనాడులో విజృంభిస్తున్న డెంగ్యూ..
ABN , Publish Date - May 19 , 2024 | 11:20 AM
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందే డెంగ్యూ జ్వరం(Dengue fever) విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేలమందికి పైగా డెంగ్యూ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలందుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
- 4 వేల మందికి పైగా పీడితులు
చెన్నై: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందే డెంగ్యూ జ్వరం(Dengue fever) విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేలమందికి పైగా డెంగ్యూ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలందుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ‘ఎడిస్’ దోమకాటు వల్ల డెంగ్యూ జ్వరం వ్యాప్తి నివారించేలా ఆరోగ్యశాఖ అవసరమైన చర్యలను వేగవంతం చేస్తోంది. అయినప్పటికీ, వర్షం కారణంగా నీటిగుంటలు, కూలర్లలో మిగిలిన నీరు, పాత టైర్లు, చెత్తకుండీలు, డ్రైనేజీ కాలువల్లో ఎడిస్ దోమలు పెరుగుతుండడం వల్ల వాటిని నిర్మూలించేందుకు మలేరియా విభాగ సిబ్బంది ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఈ నేపథ్యంలో, వర్షాకాలం ప్రారంభం కాకముందే డెంగ్యూ జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జనవరిలో 1,200 మందికి పైగా డెంగ్యూ జ్వరపీడితులకు చికిత్సలందించినట్లు మెడికల్ రికార్డుల్లో నమోదైంది.
ఇదికూడా చదవండి: Priyanka Gandhi: స్మృతి ఇరానీపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు.. గత ఐదేళ్లలో..
నివారణ చర్యలు ముమ్మరం చేయడం వల్ల ఈ సంఖ్య మార్చి, ఏప్రిల్ నెలల్లో తగ్గింది. అయినప్పటికీ, మళ్లీ పలు జిల్లాల్లో డెంగ్యూతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. 2023లో రాష్ట్రంలో 8,953 మంది డెంగ్యూ జ్వరానికి గురికాగా, వారిలో చికిత్సలు ఫలించక ముగ్గురు మరణించారు. ఈ ఏడాది ఒక్కరు మాత్రమే ఈ జ్వరంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. పెరంబలూరు, తేని, నామక్కల్, అరియలూరు, తిరువణ్ణామలై, దిండుగల్, కృష్ణగిరి, మదురై, కోయంబత్తూర్, తంజావూరు జిల్లాల్లో అంటువ్యాధుల వ్యాప్తికి కారణమైన క్రిముల నిర్మూలనకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో డెంగ్యూ మాత్రమే కాకుండా చిన్న అమ్మవారు, విరేచనాలు, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. జ్వరం వచ్చిన ఐదవ రోజు నుంచి రెండు, మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, కడుపు నొప్పి, రక్తస్రావం, నీరసం, బీపీ తగ్గిపోవడం, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలుంటే వెంటనే బాధితులు వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News