PM Modi: రెండు రోజుల పాటు జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు.. హాజరైన మోదీ
ABN , Publish Date - Aug 31 , 2024 | 11:46 AM
ఢిల్లీలో రెండు రోజుల జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ హాజరయ్యారు.
ఢిల్లీ: ఢిల్లీలో రెండు రోజుల జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ హాజరయ్యారు. న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు భారత్ మండపంలో జరగుతోంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం స్థాపనకు 75 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో స్టాంప్, నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగే రెండు రోజుల సదస్సులో జిల్లా న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, కోర్టు గదులు, న్యాయ భద్రత, న్యాయపరమైన వెల్నెస్ వంటి అంశాలపై చర్చ జరగనుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి సెప్టెంబరు 1న హాజరై ప్రసంగించనున్నారు.సుప్రీంకోర్టు జెండా, చిహ్నాలను కూడా ఆవిష్కరించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మార్గదర్శకత్వంలో, జిల్లా న్యాయవ్యవస్థపై జాతీయ సదస్సు రెండు రోజుల వ్యవధిలో ఆరు సెషన్‌లను నిర్వహించనుంది. దీనికి దేశవ్యాప్తంగా జిల్లా న్యాయవ్యవస్థ నుంచి 800 మందికి పైగా హాజరుకానున్నారు. "మౌలిక సదుపాయాలు- మానవ వనరులు" అనే అంశంపై జరిగే సెషన్‌లో జిల్లా న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాలు, మానవ మూలధనాన్ని పెంపొందించే మార్గాలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలిపింది. "అందరికీ కోర్టు రూమ్స్ (Courtrooms for all)" అనే సెషన్‌లో జిల్లా న్యాయవ్యవస్థలో యాక్సెసిబిలిటీ, ఇన్‌క్లూసివిటీ ఆవశ్యకత, అట్టడుగు వర్గాలకు సురక్షితమైన, సమానమైన న్యాయం లభించేలా చూడాల్సిన ఆవశ్యకతపై చర్చించనున్నారు.
న్యాయమూర్తుల భద్రతా సమస్యలను, శ్రేయస్సు కార్యక్రమాలను పరిష్కరించడానికి "న్యాయ భద్రత - న్యాయ సంరక్షణ" పేరిట సెషన్‌ను సైతం నిర్వహించనున్నారు. రెండవ రోజు సమర్థవంతమైన కేసు నిర్వహణ, పెండింగ్ తగ్గింపు కోసం వ్యూహాలను చర్చించడానికి "కేస్ మేనేజ్‌మెంట్" సెషన్ నిర్వహించనున్నారు. న్యాయమూర్తుల శిక్షణ కార్యక్రమాలను మెరుగుపరచడానికి "న్యాయ శిక్షణ - పాఠ్యాంశాలు, పద్ధతులు" సెషన్‌ను నిర్వహించనున్నారు. జిల్లా న్యాయవ్యవస్థ అవసరాలకు హైకోర్టులు, సుప్రీంకోర్టులు సంపూర్ణమైన రీతిలో ఎలా తోడ్పడతాయనే దానిపై చర్చను ప్రోత్సహించడానికి "బ్రిడ్జింగ్ ది గ్యాప్" అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌లు పాల్గొననున్నారు.