Diwali: దీపావళి ఎఫెక్ట్.. సొంతూళ్లకు లక్షలాది మంది ప్రయాణం
ABN , Publish Date - Oct 24 , 2024 | 11:54 AM
దీపావళి(Diwali) పండుగ సందర్భంగా నగరం నుంచి సుమారు 10 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వారికి రవాణా సదుపాయాలు కల్పించేందుకు నానా పాట్లు పడుతున్నారు.
- రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వ సంస్థల కుస్తీ
చెన్నై: దీపావళి(Diwali) పండుగ సందర్భంగా నగరం నుంచి సుమారు 10 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వారికి రవాణా సదుపాయాలు కల్పించేందుకు నానా పాట్లు పడుతున్నారు. రద్దీకి అనుగుణంగా 11,000 ప్రభుత్వ బస్సులు, 10కి పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు. ఈ నెల 31 దీపావళి నేపథ్యంలో చెన్నై, కోవై సహా పలునగరాల్లో నివసిస్తున్నవారు పండుగ జరుపుకొనేందుకు తమ స్వగ్రామాలకు వెళ్లనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. నగరం నుంచి ప్రతిరోజూ నడిపే 2,092 బస్సులతో పాటు అదనంగా 4,900 ప్రత్యేక బస్సులు కలిపి, మూడు రోజుల్లో మొత్తం 11,176 బస్ సర్వీసులు నడపనున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Rainfall Prediction: మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!
ప్రయాణికుల సంఖ్య పెరిగితే ప్రైవేటు బస్సులను కూడా అద్దెకు తీసుకొని నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో మదురై, నాగర్‌కోయిల్, కన్నియాకుమారి, సెంగోట్టై, కోవై(Madurai, Nagercoil, Kanniyakumari, Sengottai, Kovai) తదితర మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతిరోజు నడిపే 2,500 బస్సులతో పాటు అదనంగా 1,000 బస్సులు నడుపుతామని ఆమ్నీ బస్సుల యజమానుల సంఘం తెలిపింది. ఇవికాక, కార్లు, సొంత వాహనాల్లో వెళ్లేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. రాజధాని నగరం నుంచే సుమారు 10 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లనున్నారని రవాణా శాఖ అంచనా వేస్తోంది.
ఈ విషయమై రవాణాశాఖ అధికారులు మాట్లాడుతూ... దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నామన్నారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేలా కోయంబేడు, కిలాంబాక్కం, మాధవరం బస్ టెర్మినళ్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించేందుకు 1.08 లక్షల మంది రిజర్వేషన్ చేసుకున్నారన్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా చెన్నై నుంచి ప్రభుత్వ బస్సుల్లో సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేయగా, ఈ ఏడాది 5.82 లక్షల మంది వెళ్లే అవకాశముందని భావిస్తున్నామన్నారు.
ఈ విషయమై దక్షిణ రైల్వే అధికారులు మాట్లాడుతూ... నగరం నుంచి యధావిధిగా వెళ్లే రైళ్లతో పాటు 40 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్నారు. రాజధాని నగరం నుంచి రైళ్ల ద్వారా 3 లక్షల మంది ప్రయాణించే అవకాశముందన్నారు. నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారు అధికంగా 28, 29 తేదీల్లో ప్రయాణించనున్నారు. అందరూ ఒకే సమయంలో వెళ్లకుండా, ఉదయం నుంచి ప్రయాణం చేస్తే రద్దీ తగ్గడంతో పాటు శ్రమ పడాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.
మూడు రెట్లు పెరిగిన ఆమ్నీ బస్ ఛార్జీలు...
దీపావళి పండుగ సందర్భంగా ఆమ్సీ బస్సు ఛార్జీలు మూడు రెట్లు పెరగడంతో ప్రయాణికులు దిగ్ర్భాంతి చెందుతున్నారు. చెన్నై నుంచి నాగర్‌కోయిల్‌కు సాధారణంగా రూ.585 నుంచి రూ.1,200 వరకు ఛార్జీ వసూలుచేస్తుండగా, దీపావళి సందర్భంగా ఈ నెల 29వ తేది రూ.2,110 నుంచి రూ.4,350 వరకు ఛార్జీ నిర్ణయించారు. అలాగే, కోవైకు రూ.800 నుంచి రూ.1,040 వరకు ఉండగా, పండుగ సందర్భంగా 29వ తేది రూ.1,800 నుంచి రూ.3,470కి పెంచేశారు.
ఇక, మదురై, తిరుచ్చి, ఈరోడ్, సేలం, దిండుగల్ సహా పలు నగరాలకు సాధారణం కన్నా మూడు రెట్లు పెంచారు. ఛార్జీలు పెంచే ఆమ్నీ బస్సులను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటి పర్మిట్లు రద్దు చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా, ఆమ్నీ బస్సుల యజమానులు వాటిని లక్ష్యపెట్టకుండా ఛార్జీలు భారీగా పెంచుకుంటూ పోతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని అధిక ఛార్జీలు వసూలు చేసే ఆమ్నీ బస్సుల యజమానులపై తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి
ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి
ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?
Read Latest Telangana News and National News