Wayanad Landslides: పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నాం.. వయనాడ్ వైద్యుల ఆవేదన
ABN , Publish Date - Aug 02 , 2024 | 06:15 PM
వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తారు. చికిత్స ఒకటే కాదు వైద్య రంగంలో అణువణువునా వారి ప్రమేయం ఉంటుంది. మృతదేహాలను చూస్తేనే మనం వణికిపోతాం. అలాంటిది నుజ్జైన శరీరాలకు పోస్టుమార్టం చేయడంలో కూడా వైద్యులు కీలకంగా ఉంటారు.
వయనాడ్: వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తారు. చికిత్స ఒకటే కాదు వైద్య రంగంలో అణువణువునా వారి ప్రమేయం ఉంటుంది. మృతదేహాలను చూస్తేనే మనం వణికిపోతాం. అలాంటిది నుజ్జైన శరీరాలకు పోస్టుమార్టం చేయడంలో కూడా వైద్యులు కీలకంగా ఉంటారు. అయితే వయనాడ్(Wayanad Landslides) కొండచరియలు విరిగిపడిన ఘటనలో మాత్రం అక్కడి వైద్యులకు భయాందోళన కలిగించే పరిస్థితి ఎదురవుతోంది. పోస్టుమార్టం చేయలేక వైద్యులు పారిపోదామనుకుంటున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా ఓ వైద్యురాలే చెప్పడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వయనాడ్‌లోని రెండు గ్రామాల్లో జులై 30 తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇప్పటికే 300లకుపైగా మృతి చెందారు. మట్టిలో కూరుకుపోయిన వారిని బయటకి తీసేందుకు భారీ యంత్రాల సాయం తీసుకుంటున్నారు. ప్రజలందరి మీదకు దూసుకెళ్లిన బండరాళ్ల కింద మృతదేహాలు నుజ్జయ్యాయి. దీనికితోడు వరుసపెట్టి శవాలు పోస్టుమార్టం సెక్షన్‌కి తరలుతుండటంతో వైద్యులు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
ఈ క్రమంలో ఓ వైద్యురాలు మీడియాతో మాట్లాడుతూ.. "నాకు పోస్ట్ మార్టం చేయడం అలవాటే. కానీ వయనాడ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బండరాళ్ల కింద నలిగిపోయిన శవాలను చూస్తుంటే మాటల్లో చెప్పలేని భయం వేస్తోంది. రెండు శవాలను ఆ స్థితిలో చూడగానే నా కళ్లు తిరిగాయి. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎన్నడూ నాకు ఎదురుకాలేదు. కొన్ని శవాలైతే ఎవరో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ముద్దయ్యాయి. ఒకరైతే పిండి మాదిరి మారిపోయారు. వారి శరీరాలను చూస్తుంటే వణుకుపుడుతోంది. మొదటి బాడీ చూడగానే భయమేసింది. దానికి ఎలాగోలా పోస్టుమార్టం పూర్తి చేశాం. రెండోది ఏడాది వయసున్న పిల్లవాడిది. ఆ మృతదేహాన్ని చూసి పోస్టుమార్టం కొనసాగించలేనని నిర్ణయించుకున్నా. ఆసుపత్రి నుంచి పారిపోయి పునరావాస శిబిరాన్ని వెళ్లాలనుకున్నా. కానీ సాధ్యపడలేదు. ఇప్పటివరకు 18 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశాం”అని ఆ వైద్యురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
మానసిక ఒత్తిడి..
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్యులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే బాధితులను గుర్తించడానికి డీఎన్ఎ విశ్లేషణ కూడా సవాలుగా మారింది. కొందరి మృతదేహాల్లో కొన్ని అవయవాలే మిగిలి ఉండటంతో వాటి నుంచి నమూనాలను సేకరించడం సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైద్యులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. మరోవైపు ప్రమాదం నుంచి బయటపడిన వారికి ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కీలక సూచనలు చేశారు. వారందరికీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలని వైద్యులకు సూచించారు. ఘటన తాలూకు దృశ్యాలు వారి జీవితాంతం వెంటాడకుండా ఈ కౌన్సిలింగ్ ఉపయోగపడుతుందని జార్జ్ తెలిపారు.
For Latest News and National News Click Here