Bihar Crisis: ఏ తలుపులూ ఎల్లకాలం మూసుండవు.. నితీష్ రాకపై బీజేపీ
ABN , Publish Date - Jan 26 , 2024 | 06:49 PM
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో చేతులు కలిపనున్నారనే బలమైన ఊహాగానాల నేపథ్యంలో కమలనాథులు సైతం సానుకూల సంకేతాలు పంపుతున్నారు. నితీష్‌కు తలుపులు మూసేసామంటూ కొద్దికాలం క్రితం ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ శుక్రవారంనాడు తన మాట సవరించుకున్నారు. అవసరమైతే తలుపులు తెరుస్తామని చెప్పారు.
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) మరోసారి బీజేపీతో చేతులు కలిపనున్నారనే బలమైన ఊహాగానాల నేపథ్యంలో కమలనాథులు సైతం సానుకూల సంకేతాలు పంపుతున్నారు. నితీష్‌కు తలుపులు మూసేసామంటూ కొద్దికాలం క్రితం ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ (Sushil Kumar Modi) శుక్రవారంనాడు తన మాట సవరించుకున్నారు. అవసరమైతే తలుపులు తెరుస్తామని చెప్పారు. రాజకీయాల్లో ఏ తలుపులూ శాశ్వతంగా మూసుకోవని అన్నారు. బీహార్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైనప్పడు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఊహాత్మక ప్రశ్నలు వద్దు: చిరాగ్ పాశ్వాన్
ఎన్డీయేలోకి నితీష్ కుమార్ రాకపై లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆచితూచి మాట్లాడారు. ఎన్డీయేలోకి నితీష్ రాక ఎల్‌జేపీకి ఆమోదయోగ్యమేనా అనే ప్రశ్నకు ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలు వేయవద్దని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. బీజేపీ అధిష్ఠానానికి తాను అందుబాటులో ఉన్నానని, భారతరత్న కర్పూరి ఠాకూర్ గ్రామానికి వెళ్లాలనుకున్న తన పర్యటనను కూడా వాయిదా వేసుకున్నానని చెప్పారు. బీహార్‌లో ఎన్డీయే భాగస్వామిగా ఉండటానికి ఎల్‌జేపీ కట్టుబడి ఉందని తెలిపారు. నితీష్ ఎన్డీయేలోకి వస్తే చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయేను విడిచిపెట్టి ఆర్జేడీతో పొత్తుపెట్టుకోవచ్చనే ఊహాగానాలు సైతం వెలువడ్డాయి.