పొట్టలో తూటా దిగినా.. 15 మందిని కాపాడాలనే తపనతో.. జీప్‌ను బైక్‌పై వెంబడించి ప్రయాణికులపై కాల్పులు
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:16 AM
ఆ డ్రైవర్ ప్రదర్శించిన గొప్ప సాహసం, ధైర్యం.. 15 మంది ప్రాణాలను కాపాడాలనే తపనతో చూపిన పరిణతిని ఎంత పొగిడినా తక్కువే! ఇద్దరు దుండగులు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపడంతో ఓ తూటా డ్రైవర్ పొట్టలోకి దూసుకెళ్లింది.
పొట్టలో తూటా దిగినా.. 15 మందిని కాపాడాలనే తపనతో..
బిహార్‌లో ఘటన.. శస్త్రచికిత్స చేసి తూటా తొలగింపు.. తప్పిన ప్రాణాపాయం
పట్నా, డిసెంబరు 7: ఆ డ్రైవర్ ప్రదర్శించిన గొప్ప సాహసం, ధైర్యం.. 15 మంది ప్రాణాలను కాపాడాలనే తపనతో చూపిన పరిణతిని ఎంత పొగిడినా తక్కువే! ఇద్దరు దుండగులు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపడంతో ఓ తూటా డ్రైవర్ పొట్టలోకి దూసుకెళ్లింది. రక్తం కారుతున్నా.. బాధను పంటిబిగువున భరిస్తూ.. వాహనం స్పీడును మరింత పెంచాడు! దుండగుల బారి నుంచి ప్రయాణికులను కాపాడాడు. బిహార్‌లోని భోజ్‌పూర్‌లో జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. ‘తిలకం’ వేడుకలో పాల్గొన్న 15మందిని తన జీప్‌లో ఎక్కించుకొని బయలుదేరాడు డ్రైవర్ సంతోష్‌సింగ్. ఆ జీప్‌ను గుర్తు తెలియని ఇద్దరు సాయుధులు బైక్‌పై వెంబడించి కాల్పులు జరిపారు. డ్రైవర్ సింగ్, జీప్ స్పీడును పెంచాడు. ఈ క్రమంలో ఓ తూటా సింగ్ పొట్టలోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాన్ని లెక్కచేయకుండా జీప్‌ను కొన్ని కిలోమీటర్ల మేర ముందుకు దూకించి సురక్షిత ప్రదేశంలో ఆపాడు. తీవ్ర గాయాలతో డ్రైవింగ్ సీట్లోనే ఒరిగిపోయిన సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు బాధితుడి కడుపులోంచి తూటాను బయటకు తీశారు. అతడికి ప్రాణాపాయం లేదని, పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.