Eknath Shinde : ఆటోవాలా నుంచి ‘మహా’నేతగా
ABN , Publish Date - Nov 24 , 2024 | 04:39 AM
తన వర్గం ఎమ్మెల్యేలను కూడగట్టుకొని బీజేపీ మద్దతుతో సీఎం అయిన ఏక్‌నాథ్ శిందే నిన్నటిదాకా ‘తిరుగుబాటు’ నేతే! ఇప్పుడు మాత్రం
తిరుగుబాటు నేత శిందే విజయబావుటా
ముంబై, నవంబరు 23: తన వర్గం ఎమ్మెల్యేలను కూడగట్టుకొని బీజేపీ మద్దతుతో సీఎం అయిన ఏక్‌నాథ్ శిందే నిన్నటిదాకా ‘తిరుగుబాటు’ నేతే! ఇప్పుడు మాత్రం జనామోదం పొందిన అగ్రనేత. రెండున్నరేళ్ల క్రితం బీజేపీ సాయంతో శివసేనను చీల్చి.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి, కమలం పెద్దల ఆశీస్సులతోనే పదవిలో కొనసాగాడనిపించుకున్న శిందే.. తాజా ఎన్నికల ద్వారా ఒక్కసారిగా శిఖరస్థానానికి ఎదిగారు.
ఇప్పుడో మహారాష్ట్రలో దిగ్గజనేత. ఉద్ధవ్ ఠాక్రే శివసేన మట్టికరవడంతో ‘అసలైన శివసేన’ అధిపతి తానేనని అనిపించుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 15 స్థానాల్లో పోటీ చేసిన ఏడింట్లోనే గెలిచి పెద్దగా ప్రభావం చూపకపోయిన శిందే శివసేనను మహాయుతి కూటమి భాగస్వామిగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 57 స్థానాల్లో పార్టీని గెలిపించుకొని పడిలేచారనిపించుకున్నారు. రెండున్నరేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన వివిధ పథకాలకు లభించిన ఆదరణ ఆయనకు ఓట్లు రాల్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2022లో శివసేన పార్టీ అగ్రనేత ఉద్ధవ్‌ఠాక్రేపై 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీ మద్దతుతో 2022 జూలై 30న శిందే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. శిందే మౌనముని. తక్కువగా మాట్లాడతారు. శిందే వయసు 58 ఏళ్లు. ఆయన స్వస్థలం సతారా తాలూకాలోని జవాలీ. నూనుగు మీసాల వయసులో షిండే కుటుంబ పోషణ కోసం ఠాణేలో ఆటో రిక్షా నడిపేవారు.
బాల్‌ఠాక్రేకు వీరాభిమాని. అదే ఆయన్ను రాజకీయాల్లోకి ప్రవేశించేలా చేసింది. 1980లో అప్పటి ఠాణే శివసేన అధ్యక్షుడు ఆనంద్ దీఘే ఆశీస్సులతో శిందే రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో ఠాణే మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. 2001లో ఆనంద్ దీఘే స్థానంలో ఠాణేలో శివసేన పగ్గాలు చేపట్టారు షిండే. బాల్‌ఠాక్రే మేనల్లుడు రాజ్‌ఠాక్రే పార్టీ వీడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో వేరు కుంపటి పెట్టిన తర్వాత శివసేనలో శిందే ప్రాధాన్యం పెరిగింది. తాజా ఎన్నికలతో కలుపుకొంటే కోప్రీ-పచ్ పఖాడీ అసెంబ్లీ స్థానం నుంచి షిండే వరుసగా ఐదుసార్లు.. అంటే 2004, 2009, 2014, 2019, 2024లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. షిందే కుమారుడు శ్రీకాంత్ శిందే వైద్యుడు. 2014లో శ్రీకాంత్ కల్యాణ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.