Asaduddin Owaisi: ఉత్తుత్తి బెదిరింపులకు బెదరను.. 'జై పాలస్తీనా' వ్యాఖ్యల దుమారంపై ఒవైసీ
ABN , Publish Date - Jun 26 , 2024 | 04:22 PM
పార్లమెంటులో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ చివర్లో 'జై పాలస్తీనా' అని నినదించడం విమర్శలకు దారితీయడంతో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారంనాడు తొలిసారి స్పందించారు. పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకుంటూ ''ఉత్తుత్తి బెదరింపులకు బెదిరేది లేదు'' అని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ చివర్లో 'జై పాలస్తీనా' అని నినదించడం విమర్శలకు దారితీయడంతో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) బుధవారంనాడు తొలిసారి స్పందించారు. పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకుంటూ ''ఉత్తుత్తి బెదరింపులకు బెదిరేది లేదు'' అని వ్యాఖ్యానించారు. ఐదుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఉన్న ఒవైసీ ప్రమాణస్వీకారం చివర్లో 'జై తెలంగాణ, జై పాలస్తీనా' అంటూ నినదించారు. ఆయన చేసిన పాలస్తీనా నినాదంపై బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ సూటిగా స్పందించారు.
"వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయనీయండి. నాకు కూడా రాజ్యాంగం అంటే ఎంతో కొంత తెలుసు. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులకు భయపడేది లేదు'' అని ఒవైసీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తన వ్యాఖ్యలు రాజ్యాంగవిరుద్ధం కావని, అలాంటి నిబంధనలు ఏమీ రాజ్యాంగంలో లేవని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెబుతుంటారని, తాను కేవలం 'జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా' అనే అన్నానని, ఆ మాటలు రాజ్యంగ విరుద్ధం ఎలా అవుతాయని ప్రశ్నించారు. అక్కడి (పాలస్తీనా) ప్రజలు అనాథలుగా మారారని, పాలస్తీనా గురించి మహాత్మాగాంధీ కూడా చాలా మాట్లాడారని, ఆయన ఏమి మాట్లాడారో ఎవరైనా సరే చదివి తెలుసుకోవచ్చని అన్నారు.
కిరణ్ రిజిజు ఏమన్నారంటే..
కాగా, ఒవైసీ ప్రమాణస్వీకార సమయంలో 'జై పాలస్తీనా' నినాదం చేయడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారంనాడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటులో వేరే దేశం గురించి నినాదం చేయడం తగదని చెప్పారు. పాలస్తీనాతో కానీ ఏ ఇతర దేశంతో కానీ తమకు శత్రుత్వం లేదని, అయితే సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిబంధనలు పాటిస్తున్నామో లేదో సరిచూసుకోవాలని అన్నారు. ప్రమాణస్వీకారం చివర్లో పాలస్తీనా నినాదాలు చేసినట్టు కొందరు సభ్యులు తనకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు.