Delhi Excise policy: ఆప్ నేత సంజయ్‌సింగ్‌కు ఊరట.. నామినేషన్ వేసేందుకు కోర్టు అనుమతి
ABN , Publish Date - Jan 06 , 2024 | 08:00 PM
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న 'ఆప్' నేత సంజయ్ సింగ్‌కు ఊరట లభించింది. ఢిల్లీ నుంచి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికల్లో 'ఆప్' అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేసేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. ఆయనను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకు వెళ్లాలని జైల్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న 'ఆప్' నేత సంజయ్ సింగ్ (Sanjay Singh)కు ఊరట లభించింది. ఢిల్లీ నుంచి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికల్లో 'ఆప్' అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేసేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. జనవరి 8న నామినేషన్ వేసేందుకు, 10న నామినేషన్ స్కూటినీ సమయంలోనూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి ఆయనను తీసుకు వెళ్లాలని జైల్ సూపరింటెండెంట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఆదేశించారు.
సంజయ్ సింగ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ వాడరాదనీ, కేసులో నిందితులు, అనుమానితులు, సాక్షులు, పత్రికలు వారిని కలవడం కానీ, మాట్లాడటం కానీ చేయరాదని కోర్టు ఆంక్షలు విధించింది. అయితే నామినేషన్, స్క్రూటినీ సజావుగా జరిగేందుకు వీలుగా తన తరఫు న్యాయవాది, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కోర్టు ఆయనను అనుమతించింది. సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈనెల 27తో ముగియనున్నందున ఆయనను మరోసారి రాజ్యసభకు 'ఆప్' నామినేట్ చేసింది. ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో 2023 అక్టోబర్ 4న ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనను ప్రాథమిక సాక్షాలు ఉన్నాయనే కారణంగా గత డిసెంబర్ 22న విచారణ కోర్టు తోసిపుచ్చింది.