Share News

Droupadi Murmu : ప్రజలకు మెరుగైన జీవితం మన బాధ్యత

ABN , Publish Date - Nov 27 , 2024 | 03:43 AM

రాజ్యాంగ స్ఫూర్తితో సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కలిసి పనిచేయడం కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థల బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.

Droupadi Murmu : ప్రజలకు మెరుగైన జీవితం మన బాధ్యత

కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు కలిసి పని చేయాలి

పౌరుల క్రియాశీల భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలు బలోపేతం

రాజ్యాంగ దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

‘రాజ్యాంగ అసెంబ్లీ’ సంప్రదాయాలను కొనసాగిద్దాం: స్పీకర్‌ ఓం బిర్లా

న్యూఢిల్లీ, నవంబరు 26: రాజ్యాంగ స్ఫూర్తితో సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కలిసి పనిచేయడం కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థల బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో నిర్వహించిన 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఈ మూడు వ్యవస్థలతోపాటు పౌరులందరి క్రియాశీల భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలు బలోపేతమవుతాయన్నారు. గత కొన్నేళ్లుగా పార్లమెంటు చేసిన అనేక చట్టాల్లో ప్రజల ఆకాంక్షలు ప్రస్ఫుటమయ్యాయని, సమాజంలోని అన్ని వర్గాలు.. ప్రత్యేకించి బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. పౌరులంతా తమ భావాల్లో రాజ్యాంగ ఆదర్శాలను కలిగి ఉండాలని, ప్రాథమిక విధులను పాటించాలని, 2047 నాటికి వికసిత భారత్‌ నిర్మాణం లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు కదలాలని ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.


ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ దేశం కంటే తమ మతవిశ్వాసాలకే రాజకీయ పార్టీలు అధిక ప్రాధాన్యం ఇస్తే మన స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుందని అంబ్కేడ్కర్‌ చెప్పినట్లు గుర్తుచేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ రాజ్యాంగ అసెంబ్లీ నిర్దేశించిన సంప్రదాయం మేరకు నిర్మాణాత్మక, గౌరవ ప్రదమైన చర్చలను పార్లమెంటు సభ్యులు కొనసాగించాలని కోరారు. ‘దేశమే ముందు’ అనే స్ఫూర్తిని పెంపొందించేలా ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరపుకోవాలన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 03:43 AM