తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు
ABN , Publish Date - Dec 20 , 2024 | 03:33 AM
నూతన సంవత్సరంలో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. వీసా కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన అవసరం ఇంక ఎంతమాత్రం లేదు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా జారీ విధానాలను సరళీకరిస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
యూఎస్ వీసా జారీ నిబంధనల్లో మార్పు
న్యూఢిల్లీ, డిసెంబరు 19: నూతన సంవత్సరంలో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. వీసా కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన అవసరం ఇంక ఎంతమాత్రం లేదు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా జారీ విధానాలను సరళీకరిస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చిన నిబంధనలు 2025, జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్, రీ షెడ్యూల్ మరింత సులభమవుతుంది. అలాగే దానికోసం ఎదురు చూడాల్సిన సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈమేరకు భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటన చేసింది. ‘ప్రతి ఒక్కరూ వీసా అపాయింట్‌మెంట్ సమయం పొందడానికి, వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనుగుణంగా పలు మార్పులు చేశాం. నూతన నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు వారి అపాయింట్‌మెంట్‌ను ఎలాంటి అదనపు రుసుము లేకుండా నచ్చిన వీసా కేంద్రానికి మార్చుకొని, ఒకసారి రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒకవేళ రీ షెడ్యూల్ చేసుకున్న సమయానికి వీసా ఇంటర్వ్యూకి వెళ్లలేక, మరోసారి రీ షెడ్యూల్ చేసుకోవాలని భావిస్తే కొత్త అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి’ అని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది.