Share News

Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:49 PM

ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా ‘చోప్రా’ ఘటన వీడియోపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన షాక్‌‌కు గురయ్యారు. ఇది అనాగరికమైన చర్య అని అభివర్ణించారు.

Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్
West Bengal CM Mamata Benerjee

కోల్‌కతా, జులై 01: ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా ‘చోప్రా’ ఘటన వీడియోపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన షాక్‌‌కు గురయ్యారు. ఇది అనాగరికమైన చర్య అని అభివర్ణించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. దీనిపై వెంటనే నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సోమవారం కోల్‌కతాలో వెల్లడించారు.

చోప్రాలో ఓ జంట అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ జంటను నడిరోడ్డుపై టీఎంసీ స్థానిక నాయకుడు తాజ్‌ముల్ అలియాస్ జేసీబీ వెదురు కర్రతో చావకొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సీఎం మమతను గవర్నర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Also Read: INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన


మరోవైపు ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు స్పందించాయి. ఆ క్రమంలో అధికార టీఎంసీ నాయకుడు తాజ్‌ముల్ చర్యను ఆ యా పార్టీలు ఖండించాయి. అయితే తాజ్‌ముల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే దాడికి గురైన సదరు జంటకు భద్రత కల్పించినట్లు వారు వివరించారు.

ఇంకోవైపు ఈ వీడియోపై బీజేపీ నేత అమిత్ మాలవ్య ఎక్స్ వేదికగా స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం సందేశ్‌కాలీని తలపిస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్‌కు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండడం.. మహిళలకు శాపమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవన్నారు. అయితే సదరు వీడియోలో టీఎంసీ స్థానిక నేత తాజ్‌ముల్ చర్యను ఈ సందర్భంగా అమిత్ మాలవ్య ఖండించారు.

ఇక ఈ వీడియోపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ఆ మహిళపై ఆ విధంగా ఎలా దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. మహిళపై దాడి ఓ అనాగరికమైన చర్య అని అభివర్ణించారు. ఇటువంటి హింసాత్మక చర్యల వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుందని చౌదరి పేర్కొన్నారు.

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 02:50 PM