Share News

NEET-UG row: అల్ ఇండియా ఎగ్జామ్స్ నిర్వహణను కేంద్రం వదులుకోవాలి.. చిదంబరం సలహా

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:45 PM

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పై తలెత్తిన వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పి.చిదంబరం కీలక సూచనలు చేశారు. ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం వదులుకోవాలని, వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల నిర్వహణ హక్కును తిరిగి రాష్ట్రాలకు అప్పగించాలని 'ఏఎన్ఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

NEET-UG row: అల్ ఇండియా ఎగ్జామ్స్ నిర్వహణను కేంద్రం వదులుకోవాలి.. చిదంబరం సలహా

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG exam 2024)పై తలెత్తిన వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పి.చిదంబరం (P Chidambaram) కీలక సూచనలు చేశారు. ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం వదులుకోవాలని, వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల నిర్వహణ హక్కును తిరిగి రాష్ట్రాలకు అప్పగించాలని 'ఏఎన్ఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


ఇదో కుంభకోణం...

''నీట్ అనేది ఓ కుంభకోణం. గత మూడు నాలుగేళ్లుగా మేము ఈ విషయం చెబుతూనే ఉన్నాం. నీట్ నుంచి మినహాయించాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానం కూడా ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం నడుుతున్న కాలేజీల్లో విద్యార్థుల ఎంపికకు సొంతంగా ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించే హక్కు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలకు ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆల్ ఇండియా స్థాయి పరీక్షలు అంటున్నారో అప్పుడే ఇలాంటి కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయి'' అని చిదంబరం నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. అతి పెద్ద దేశమైనందున పరీక్షలు రాసే విద్యార్థులు చాలా ఎక్కువమంది ఉంటారని, దీనిని పరిగణనలోకి తీసుకుని ఈ ఆల్-ఇండియా స్థాయి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ఒదులుకోవాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రమే పరిమితం కావాలని ఆయన సూచించారు. నీట్-యూజీ పరీక్షా పత్రాల లీకేజీ, అవకతవకలకు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు.


కొత్త క్రిమినల్ చట్టాలు దాదాపు కంట్ అండ్ పేస్ట్‌లే..

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై పి.చిదంబరం నిశిత వ్యాఖ్యలు చేశారు. ఐపీసీ, సీఆర్‌పీసీలో చెప్పిన వాటిని 90 నుంచి 95 శాతం కట్ అండ్ పేస్ట్ చేశారని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో చెప్పినవాటిని 95-99 శాతం వరకూ కట్ అండ్ పేస్ట్ చేశారని చెప్పారు. తాను సుమారు 40 ప్రశ్నలు వేసినప్పటికీ ఒక్కదానికి సమాధానం రాలేదన్నారు. అధిక భాగం కట్ అండ్ పేస్ట్ అయినప్పుడు, కొద్దిపాటి మార్పులు చేర్పుల కోసం సవరణలు చేయవచ్చని అన్నారు. ఇందుకు బదులుగా చట్టాలను తిరిగి రాయడం, ప్రతి సెక్షన్ రీనెంబర్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. కొత్త చట్టాలు కేవలం గందరగోళం సృష్టంచేందుకు ఉద్దేశించిన ఆలోచన మాత్రమేనని అన్నారు. ఈ అంశాలపై కాంగ్రెస్ లీగల్, మానవ హక్కుల శాఖ ఈ నెలాఖరులో ఒక సదస్సు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు.

P chidambaram: ఎమర్జెన్సీ పొరపాటని ఇందిరాగాంధీనే ఒప్పుకున్నారు..


రాహుల్‌పై విమర్శలు అసంబద్ధం

హిందూ సమాజాన్ని రాహుల్ గాంధీ అవమానించారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని చిదంబరం వ్యాఖ్యానించారు. ''దేశంలోని మొత్తం జనాభాల్లో ఇంచుమించు 80 శాతం మంది హిందువులు ఉన్నారు. కానీ మేము హిందూ బ్యాడ్జ్ తగిలించుకోవడం కానీ మైనారిటీలకు వ్యతిరేకం కానీ కాదు. హిందువులుగా మనం ముస్లింలు, క్రైస్త్రవులు, సిక్కులు వంటి ఇతర మతాల వారితో కలిసి జీవిస్తున్నాం. ఇది హిందూ దేశం కాబట్టి హిందూ మతం మాత్రమే ఉండాలని, హిందూ కోడ్ మాత్రమే పాటించాలని బీజేపీ ఆలోచనగా ఉంది. ఈ ఆలోచనను దేశంలోని చాలా పెద్దమొత్తంలో ప్రజలు అంగీకరించడం లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి ఎన్ని ప్రసంగాలు చేయలేదు? వారిని చొరబాటుదారులని పిలిచారు. వాళ్లు ఎక్కువ సంతానం కంటుకున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశ సంపదను ముస్లింలకు కట్టబెడుతుందని అన్నారు. ఇంత ముస్లిం వ్యతిరేక ప్రచారం సాగించినా 70 శాతం ఓటర్లు బీజేపీకి ఓటువేయలేదు. దీని అర్ధం ఏమిటి? మంచి హిందువుగా ఉంటూ మత విధానాలు పాటించాలే కానీ ఇతరులను టార్గెట్‌గా చేసేందుకు హిందూయిజం ఆయుధాలు ఉపయోగించకూడదు'' అని చిదంబరం పేర్కొన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 14 , 2024 | 04:45 PM