Donald Trump : ఆటోమేటిగ్గా గ్రీన్‌కార్డు!!
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:11 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస కార్డు)లు మంజూరుచేస్తామని ప్రకటించారు.
అమెరికా కాలేజీల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ లక్కీ చాన్సు!
గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే మంజూరు మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన
వాషింగ్టన్, జూన్ 21: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస కార్డు)లు మంజూరుచేస్తామని ప్రకటించారు. గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఆటోమేటిగ్గా గ్రీన్ కార్డు అందుకునేలా పాలసీ తీసుకొస్తానని తెలిపారు. దీనివల్ల చైనా, భారతీయ విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. వాస్తవానికి ఈ కొత్త పాలసీ ఆయన గత వైఖరికి భిన్నంగా ఉంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా స్వదేశీ విధానం.. ‘బై అమెరికన్.. హైర్ అమెరికన్’ను కఠినంగా అమలు చేశారు. అత్యంత నైపుణ్య సిబ్బంది, విద్యార్థుల వలసలపై కఠిన ఆంక్షలు విధించారు.
ఇప్పుడు ప్రవాస భారతీయులు, చైనీయుల మద్దతు కూడగట్టుకునేందుకు వైఖరి మార్చారని అంటున్నారు. గురువారం ఆయన వెంచర్ క్యాపిటలిస్టులు, టెక్ ఇన్వెస్టర్లతో పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. జూనియర్ కాలేజీలు సహా అమెరికాలో ఏ కాలేజీలో చదివినా డిప్లొమాలో భాగంగా గ్రీన్‌కార్డు కూడా అందుతుందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడం కోసం నిపుణులందరూ అమెరికాలోనే నివసించడం అవసరమని పేర్కొన్నారు. అయితే, అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగించే కమ్యూనిస్టులు, ర్యాడికల్ ఇస్లామిస్టులు, హమాస్ మద్దతుదారులు, అమెరికా విద్వేషకులు, నేరాభియోగాలు ఉన్నవారికి ఇది వర్తించదని స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రతిపాదన చట్టమైతే.. గ్రీన్‌కార్డుల సంఖ్య భారీగా పెరుగుతుందని.. ఏటా 10 లక్షల మంది చైనా, భారత్ విద్యార్థులకు అమెరికా విద్యావకాశాలు కల్పిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఆకస్మికంగా కొత్త పాలసీ ప్రతిపాదించడానికి ముఖ్యమైన కారణమే ఉంది. అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గత మంగళవారం కొత్త వలస కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దీనిప్రకారం అమెరికన్ పౌరులను వివాహమాడేవారికి చట్టబద్ధమైన నివాస హక్కు, పౌరసత్వ హక్కు కల్పిస్తామన్నది దాని సారాంశం. ఇది బైడెన్‌కు, అధికార డెమోక్రాటిక్ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే అవకాశం ఉండడంతో.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు విధానం ప్రతిపాదించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.