Agniveer: ప్రభుత్వం కీలక నిర్ణయం.. అగ్నివీరులకు పోలీస్, మైనింగ్ శాఖలో 10 శాతం ఉద్యోగాలు
ABN , Publish Date - Jul 18 , 2024 | 09:19 AM
అగ్నిపథ్ పథకంపై(Agnipath Scheme) కేంద్రం, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతున్న సమయంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు(Agniveer) పోలీసు, మైనింగ్‌లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ప్రకటించారు.
చంఢీగఢ్: అగ్నిపథ్ పథకంపై(Agnipath Scheme) కేంద్రం, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతున్న సమయంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు(Agniveer) పోలీసు, మైనింగ్‌లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ప్రకటించారు.
ఎవరైనా అగ్నివీరుడు వ్యాపారం చేసుకోవాలనుకుంటే రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని చెప్పారు. కానిస్టేబుల్, మైనింగ్ గార్డు, ఫారెస్ట్ గార్డు, జైలు వార్డెన్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని స్పష్టం చేశారు.
మరో నెల రోజుల్లో హరియాణాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని,ప్రధాని మోదీ తీసుకువచ్చిన పథకాల్లో ఇది కూడా ఓ మంచి పథకమని పేర్కొన్నారు. గ్రూప్ సి, డి పోస్టులకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఉంటుందని సైనీ తెలిపారు. అగ్నివీర్ తొలి బ్యాచ్ కోసం 5 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. "ఏదైనా పరిశ్రమ నెలకు రూ.30 వేల కంటే ఎక్కువ జీతంతో అగ్నివీర్‌ను నియమించినట్లయితే, ప్రభుత్వం ఆ యూనిట్‌కు రూ.60 వేల వార్షిక సబ్సిడీని ఇస్తుంది. అగ్నివీర్లకు ప్రాధాన్యత క్రమంలో ఆయుధ లైసెన్స్‌లు ఇస్తాం" అని సైనీ చెప్పారు.
అగ్నివీర్ అంటే..
కేంద్ర ప్రభుత్వం 2022లో ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకొచ్చింది. భారత సైన్యంలోని మూడు విభాగాలైన సైన్యం, వాయుసేన, నౌకాదళాలకు సంబంధించిన నియామకాల కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద నియమితులయ్యే సైనికుడిని 'అగ్నివీర్' అని వ్యవహరిస్తారు.
వారి పదవీకాలం నాలుగేళ్లు. అగ్నివీర్ పథకం తీసుకొచ్చిన తర్వాత, గతంలో ఉన్న నియామక ప్రక్రియలను భారత రక్షణ శాఖ నిలిపివేసింది. అగ్నిపథ్ పథకం ప్రకారం, నాలుగేళ్లు పూర్తయిన తర్వాత అగ్నివీరులలో 25 శాతం మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల సర్వీస్ అనంతరం పదవీ విరమణ పొందుతారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ పథకంపై నిరసనలు వెల్లువెత్తాయి. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ సహా విపక్షాలు ఈ పథకంపై లోక్ సభలో మండిపడుతున్నారు.
For Latest News and National News click here