Rahul Gandhi: సంపద పునఃపంపిణీ వివాదంపై రాహుల్ గాంధీ క్లారిటీ
ABN , Publish Date - Apr 24 , 2024 | 04:23 PM
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 'సామాజిక-ఆర్థిక సర్వే' హామీపై ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందనేది తెలుసుకునేందుకే సర్వే చేస్తామని తాము చెబుతున్నామని అన్నారు. సర్వే అనంతరం చర్యలు తీసుకుంటామని తాము చెప్పలేదన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 'సామాజిక-ఆర్థిక సర్వే' హామీపై ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందనేది తెలుసుకునేందుకే సర్వే చేస్తామని తాము చెబుతున్నామని అన్నారు. సర్వే అనంతరం చర్యలు తీసుకుంటామని తాము చెప్పలేదన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'సంపద సర్వే' హామీ రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రజల సంపద, నగల్ని దోచుకుని అందరికీ పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోందంటూ ప్రధానమంత్రి మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కూడా మోదీ విమర్శలకు దగ్గరగా ఉన్నాయనే అభిప్రాయానికి తావిచ్చింది. అమెరికాలో వారసత్వ పన్ను ఉందని, ఆ ప్రకారం ఒక వ్యక్తి మరణం తర్వాత ఆయన సంపదనలో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు వెళ్తుందని, తక్కిన 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగానే అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 'సంపద సర్వే' హామీపై కాంగ్రెస్ వివరణ ఇచ్చింది.
Mallikarjun Kharge: 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు.. మోదీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలపై ఖర్గే
మేము ఆ మాట చెప్పలేదు..
ఢిల్లీలో జరిగిన పార్టీ సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, సామాజిక-ఆర్థిక సర్వేతో కూడిన కులగణనకు ఎందుకు వాళ్లు (బీజేపీ) భయపడుతున్నారని ప్రశ్నించారు. సర్వేతో అసలు సమస్య ఎంటో, ఎక్కడుందో తెలుస్తుందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే తొలి నిర్ణయం దీనిపైనే ఉంటుందన్నారు. సమాజంలో అన్యాయానికి గురవుతున్న 90 శాతం మందికి న్యాయం కల్పించడమే తమ ఉద్దేశమన్నారు. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందనేది తెలుసుకునేందుక సామాజిక-ఆర్థిక సర్వేతో కూడిన కులగణన ఉద్దేశమని చెప్పారు. దేశభక్తులమని చెప్పుకునే వారికి సామాజిక-ఆర్థిక సర్వేతో కూడిన కులగణన గురించి భయమెందుకని ప్రశ్నించారు. 70 ఏళ్ల తర్వాత చేపట్టనున్న కీలకమైన సర్వే ఇదని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి ప్రధానిలో ఆందోళన మొదలైందని చెప్పారు. 90 శాతం భారతీయులకు అన్యాయం జరిగిందని, దీన్ని సరిచేయాలని తాను చెప్పినప్పటి నుంచి ప్రధాని, బీజేపీ తనపై దాడి మొదలుపెట్టినట్టు చెప్పారు. కచ్చితంగా తమది (కాంగ్రెస్) రివల్యూషనరీ మేనిఫెస్టో అని రాహుల్ స్పష్టం చేశారు.
Read National News and Telugu News