Share News

Delhi CM: తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు?.. రేసులో ఉన్నది వీళ్లే!

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:16 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కాలం కొన్ని నెలలు మాత్రమే ఉన్నప్పటికీ.. కీలక అంశాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాలనే ఉద్దేశంతో ఆప్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ శ్రేణుల్లో విస్తృత ఆమోదం ఉన్న నాయకుడు లేదా నాయకురాలని సీఎం పదవికి ఎంపిక చేయాలని చూస్తోంది. దీంతో కేజ్రీవాల్ వారసుడు ఎవరు? ఆయన జైల్లో ఉన్నంతకాలం ప్రభుత్వాన్ని చక్కబెట్టిన మంత్రి, పార్టీ సీనియర్ అతిషిని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తారా?. ఇంకెవరినైనా వరిస్తుందా!!

Delhi CM: తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు?.. రేసులో ఉన్నది వీళ్లే!
CM Kejriwal

‘ఇది నాకు నేను విధించుకునే అగ్నిపరీక్ష. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా’ అంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కాలం కొన్ని నెలలు మాత్రమే ఉన్నప్పటికీ.. కీలక అంశాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాలనే ఉద్దేశంతో ఆప్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ శ్రేణుల్లో విస్తృత ఆమోదం ఉన్న నాయకుడు లేదా నాయకురాలని సీఎం పదవికి ఎంపిక చేయాలని నాయకత్వం చూస్తోంది. దీంతో కేజ్రీవాల్ వారసుడు ఎవరు? ఆయన జైల్లో ఉన్నంతకాలం ప్రభుత్వాన్ని, పార్టీని చక్కబెట్టిన మహిళా మంత్రి, పార్టీ సీనియకురాలు అతిషిని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తారా?. లేక ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా?.. ఇలా అనేక ప్రశ్నలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్నవారంటూ కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారెవరో ఒకసారి గమనిద్దాం..


రేసులో ముందున్న మంత్రి అతిషి..

విద్య శాఖతో పాటు పలు కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రి అతిషి సీఎం రేసులో అందరికంటే ముందున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఆమె చదువుకున్నారు. ఢిల్లీలో పాఠశాలల్లో విద్య వ్యవస్థను మెరుగుపరచడానికి ఆప్ ప్రభుత్వం చేసిన కృషిలో ఆమె కీలకంగా వ్యవహరించారు. కల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యాక ఆమె మంత్రి అయ్యారు. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైలులో ఉన్నప్పుడు ఆమె పార్టీని నడిపించారు. ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అతిషిని కేజ్రీవాల్ ఎంచుకున్నారు.


సౌరభ్ భరద్వాజ్ మూడు సార్లు ఎమ్మెల్యే..

మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ ప్రభుత్వంలో విజిలెన్స్, హెల్త్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా అరెస్టయిన తర్వాత ఆయన కూడా మంచి పేరు పొందారు. గతంలో భరద్వాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అగ్రనేతలు జైలులో ఉన్నప్పుడు పార్టీని చక్కబెట్టిన కీలక నేతల్లో ఈయన కూడా ఉన్నారు.


పార్టీ కీలక సభ్యుడు రాఘవ్ చద్దా..

ఆప్ జాతీయ కార్యవర్గ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చద్దా పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్టీ కీలక నేతల్లో ఒకరిగా ఆయన గుర్తింపు ఉంది. కెరీర్ పరంగా గతంలో ఆయన చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆప్ ప్రారంభమైన నాటి నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. గతంతో రాజేందర్ నగర్ ఎమ్మెల్యే కూడా పనిచేశారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్‌లో కీలక సమస్యలపై గళం విప్పుతారని ఆయనకు మంచి గుర్తింపు ఉంది.


సీనియర్ నేత కైలాష్ గెహ్లాట్..

పార్టీ సీనియర్ నాయకుడైన కైలాష్ గెహ్లాట్ పేరు కూడా సీఎం రేసులో ఉన్నవారి జాబితాలో వినిపిస్తోంది. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. ఢిల్లీలోని ఆప్ సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు. రవాణా, ఆర్థిక, గృహ వ్యవహారాలు వంటి కీలకమైన శాఖలను ప్రస్తుతం మంత్రిగా నిర్వర్తిస్తున్నారు. 2015 నుంచి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలోనూ ప్రాక్టీస్ చేసిన అనుభవం ఆయనకు ఉంది. 2005-2007 మధ్య హైకోర్టు బార్ అసోసియేషన్‌లో మెంబర్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారు.


పార్టీ వ్యవస్థాపక సభ్యుడు సంజయ్ సింగ్

ఢిల్లీ సీఎం పీఠం రేసులో ఆప్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న సంజయ్ సింగ్ పేరు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 2018 నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్‌లో పలుమార్లు ఆకట్టుకునేలా ప్రసంగాలు చేశారు. ఆప్ ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, జాతీయ కార్యవర్గ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కీలక సమస్యలపై పార్టీ వైఖరిని మీడియాకు తెలియస్తుంటారు. నిత్యం మీడియా చర్చల్లో పాల్గొంటుంటారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈయన కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.


ఇవి కూడా చదవండి

రాజీనామా చేస్తా.. సీఎం కేజ్రీవాల్ ప్రకటన

అయ్యప్ప భక్తులకు శుభవార్త

Updated Date - Sep 16 , 2024 | 11:22 AM